ఆ 17మంది ఎక్కడ? బోటులోనే ఇరుక్కుపోయారా? డెడ్ బాడీలు కూడా దొరకవా? 

 

గోదావరిలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్టీఆర్ఎఫ్, నేవీ, ఎస్డీఆర్‌ఎఫ్‌, ఫైర్ అండ్ ఓఎన్జీసీ బృందాలు హెలికాప్టర్లతో గోదావరిని జల్లెడపడుతున్నాయి. అయితే, మూడ్రోజులుగా రాజమండ్రి, దేవీపట్నం, కచ్చులూరు పరిధిలో ముమ్మర గాలింపు చేపట్టినా, మొత్తం మృతదేహాలను వెలికితీయలేకపోయారు. అయితే, మూడోరోజు సెర్చ్ ఆపరేషన్స్ లో భారీ పురోగతి సాధించారు. ఎక్కడైతే బోటు మునిగిందో... అక్కడ లంగరేసి... బోటును కదపడంతో... మృతదేహాలు బయటికి వచ్చాయి. దాంతో ఒక్కరోజే 22 మృతదేహాలను వెలికితీశారు. ఇప్పటివరకు మొత్తం 30 మృతదేహాలను బయటికి తీయగా, 20 డెడ్‌బాడీస్‌కు గుర్తించి పోస్టుమార్టం తర్వాత బంధువులకు అప్పగించారు. అనంతరం ప్రత్యేక అంబులెన్సుల్లో మృతదేహాలను స్వస్థలాలకు తరలించారు. 

మూడోరోజు వెలికితీసిన 22 మృతదేహాల్లో ఐదుగురిని తెలంగాణవాసులుగా గుర్తించారు. అందులో సాయికుమార్(రంగారెడ్డి), గడ్డమీద సునీల్(వరంగల్), బసిక వెంకటయ్య(వరంగల్), గొర్రె రాజేందర్‌(వరంగల్), అలాగే నల్గొండకి చెందిన పాశం తరుణ్‌రెడ్డిగా ఐడెంటిఫై చేశారు. మరోవైపు, మూడ్రోజులుగా రాజమండ్రిలోనే మకాం వేసిన తెలంగాణ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, పువ్వాడ అజయ్‌, ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌.... దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

మునిగిపోయిన బోటులో మొత్తం 73మంది ఉండగా, 26మంది ప్రాణాలతో బయటపడ్డారు. అలాగే, ఇప్పటివరకు 30 మృతదేహాలను వెలికితీశారు. దాంతో ఇంకా 17మంది ఆచూకీ లభించాల్సి ఉంది. అయితే, వీళ్లంతా బోటులో ఇరుక్కుపోయి ఉంటారని భావిస్తున్నారు. బోటును బయటికి తీస్తేనే మృతదేహాలు బయటపడే అవకాశముందంటున్నారు. అయితే, లోతైన నదీగర్భంలో బోటు మునిగిపోవడంతో బయటికి తీయడం కష్టమేనంటున్నారు అధికారులు. కానీ లేటెస్ట్ టెక్నాలజీని వినియోగించి బోటును బయటికి తీస్తామంటున్నారు ఏపీ డీజీపీ. ప్రమాదంపై దర్యాప్తు జరుగుతోందన్న డీజీపీ గౌతమ్ సవాంగ్‌.... బాధ్యులందరిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.