ఆలోచన గురించి జిడ్డు కృష్ణమూర్తి మాటలు!

మన జీవితాలలో ఆలోచన ఎందుకంత ప్రముఖపాత్ర వహిస్తుంది? ఆలోచన అంటే భావనలు, మెదడు కణాలలో పేరుకొని పోయిన జ్ఞాపకాల ప్రతిస్పందనలు. బహుశ  చాలమంది ఇంతవరకు ఇటువంటి ప్రశ్న వేసుకోకొకపోయి ఉండవచ్చు. ఒకవేళ వేసుకున్నా. ఇదంతా ముఖ్యమయినది కాదు. ముఖ్యమయినది భావోద్వేగం! అనుకుని వుంటారు. అయితే, యీ రెంటినీ వేరు చేయడం ఎలాగో ఆలోచన, రాగభావానికి కొనసాగింపు ఇవ్వకపోయినట్లయితే, ఆ భావన త్వరలోనే క్షీణించి పోతుంది. కాబట్టి - మన నిత్య జీవితాలలో, తిరుగుడు రాళ్ల మధ్య నలిగిపోతూ, భయ విహ్వలమయిన జీవితాలలో ఆలోచన ఎంత ప్రాముఖ్యత సంపాదించుకుంది? ఎవరికి వారు ప్రశ్నించుకుని చూడాలి.

మనిషి ఆలోచనకు ఎందుకు బానిస అయిపోయాడు? మోసకారి, తెలివి అయినది, అన్నిటినీ అమర్చేది, ప్రారంభంచేసేది, అన్వేషించి పెట్టేది, యుద్ధాలను తీసుకువచ్చింది, భయోత్పాతాన్ని సృష్టించినది, ఎంతో ఆదుర్దాను క్షణక్షణమూ రూపకల్పనలు చేస్తున్నది, తన తోకను తానే మింగుతున్నది,  నిన్నటి సుఖాలలో ఓలలాడుతూ ఆ సుఖాలను నేడు రేపు కూడా కొనసాగించేది,  ఆలోచన ఎప్పుడూ చురుకయినది, కబురు చెబుతుంది, కదులుతుంది, నిర్మాణం చేస్తుంది. తీసుకుపోతుంది, అదనంగా కలుపుతుంది, ఏవేవో అనుకుంటుంది!

భావనలు మనకు ఆచరణకంటే ముఖ్యమయిపోయినాయి, అనేక క్షేత్రాలలో పాండిత్యం సంపాదించిన మహా విజ్ఞానులు వ్రాసిన పుస్తకాలలో చాతుర్యంతో వెలిబుచ్చిన అభిప్రాయాలు చాల మోసకారి, సూక్ష్మమయిన ఈ భావనలను మనం ఆరాధిస్తున్నాం. పుస్తకాలను పూజిస్తున్నాం. మనమే ఆ పుస్తకాలం. మనమే ఆ అభిప్రాయాలు. వాటితో చిక్కగా నిబద్దులమయి పోయాం. భావాలను ఆదర్శాలను ఎప్పుడూ చర్చించుకుంటూ తార్కికంగా ఉద్దేశ్యాలు వెలిబుచ్చుతున్నాం. ప్రతి మతానికి తనదే అయిన విశ్వాసము, సూత్రము, భగవంతుళ్లను చేరుకునే మూసకట్టు వున్నాయి. ఆలోచన ప్రారంభాన్ని గురించి చూస్తున్నప్పుడు యీ భావనల కట్టడాన్నే ప్రశ్నిస్తున్నాం. భావాలను చర్యలనుంచి వేరు చేశాం. ఎందుకంటే, భావనలు ఎప్పుడూ గతానికి చెందినవి. ఆచరణ వర్తమానానికి సంబంధించినది. అంటే, జీవితం ఎప్పుడూ వర్తమానంలోనే వుంటుంది. మనకు జీవించడం భయం కాబట్టి గతం భావనల రూపంలో మనకు అత్యంత ముఖ్యమయినది అయిపోయింది.

మన ఆలోచన విధానాన్ని గమనించడం ఆసక్తిదాయకంగా వుంటుంది. మనం ఎలా ఆలోచిస్తున్నాం, మనం ఆలోచన అనుకుంటున్న ప్రతి చర్య ఎక్కడనుంచి బయలుదేరుతోంది? తప్పనిసరిగా జ్ఞాపకం నుంచే కదూ! ఆలోచించటానికి ప్రారంభం అంటూ ఉందా? ఉంటే, దానికి మనం పట్టుకోగలమా అంటే, జ్ఞాపకం యొక్క ప్రారంభం ఎందుకంటే మనకు జ్ఞాపకశక్తి అంటూ లేకపోతే ఆలోచనలే వుండవు. ఆలోచన ఏ రకంగా నిన్నటి ఒక సుఖానికి బలం చేకూర్చి కొనసాగింపు ఇస్తుందో సుఖానికి వ్యతిరేకమయిన దుఃఖం, భయాలను సైతం కొనసాగించడం కూడా కల్పిస్తుంది.  అనుభవించేవాడు వాడే ఆలోచించేవాడు. తానే ఆ సుఖము, దుఃఖము అయి, వాటిని పెంచి పోషించేవాడు అవడము కూడా చూపెడుతుంది.  ఆలోచన చేస్తున్నవాడు సుఖాన్ని బాధనుండి వేరు చేస్తాడు. సుఖాపేక్షలోనే దుఃఖము, బాధ, భయాలకు ఆహ్వానం ఇమిడి వున్నదని గమనించడు. మానవ సంబంధాలలో ఆలోచన ఎప్పుడూ సుఖాన్ని కోరుతోంది. దీనికి అనేక పేర్లు ఇస్తుంది. విశ్వాసం, సహాయం, దానం పోషణ, సేవ ఇలా. 

మనం ఎందుకు సేవించాలనుకుంటున్నామో! పెట్రోల్ స్టేషన్ మంచి సేవలను అందిస్తుంది. ఈ మాటల అర్థం యేమిటి,  సహాయం, ఇవ్వడం, సేవలు చేయడం? ఇదంతా యేమిటి? సౌందర్యంతో, తేజస్సుతో, సౌకుమార్యంతో నిండిన కుసుమం నేను ఇస్తున్నాను, సహాయ పడుతున్నాను, సేవిస్తున్నాను' అని ప్రకటిస్తుందా? అది వుంటుంది, అంతే. అది యేమీ చేయటానికి ప్రయత్నం చేయదు గనుక భూమి అంతా ప్రసరిస్తుంది.

ఆలోచన చాల మోసకారి, తెలివయినది. తన సౌకర్యం కోసం దేన్నయినా వికృత పరచగలదు. సుభాపేక్షతో విర్రవీగే ఆలోచన తన దాస్యాన్ని తానే తెచ్చుకుంటుంది. ఆలోచన ద్వంద్వ ప్రకృతిని తీసుకు వస్తుంది. మన సంబంధ బాంధవ్యాలలో, మనలో సుఖాన్ని తీసుకు వచ్చే హింస ఉంది, దయగా ఉదారంగా వుండాలనే కోరిక వున్నది. మన జీవితాలలో యెప్పుడూ జరుగుతున్నది యిదే. ఆలోచన యీ ద్వైతభావాలను తీసుకురావడం, వైరుధ్యాన్ని ప్రవేశపెట్టటమే కాక, అసంఖ్యాకంగా జ్ఞాపకాలను పోగు చేసుకుంటుంది. సుఖమూ బాధలతో కూడిన ఈ జ్ఞాపకాలద్వారా అది పునరుజ్జీవనం పొందుతుంది. కనుక ఆలోచన గతానికి చెందినది. పాతది.

                                     ◆నిశ్శబ్ద.