ఖమ్మంలో కారు స్పీడెంత? ఇల్లందులో జెండా ఎగురుతుందా?

అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ అంతటా ప్రభంజనం సృష్టించిన టీఆర్ఎస్... ఒక్క ఖమ్మం జిల్లాలో మాత్రం సత్తా చాటలేకపోయింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తం మీద ఒకే ఒక్క సీటు మాత్రమే గెలుచుకోగలిగింది. అయితే, ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం సెగ్మెంట్లో గులాబీ జెండా ఎగురవేసింది. ఇక, ఇఫ్పుడు మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ముఖ్యంగా సింగరేణికి స్వస్థలమైన ఇల్లందు మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురవేసేందుకు టీఆర్ఎస్‌ ప్రయత్నిస్తోంది.

గ్రామ పంచాయతీగా ప్రస్థానం ప్రారంభించిన ఇల్లందు... 1954లో నగర పంచాయతీగా అవతరించింది. పదుల సంఖ్యలో బొగ్గు గనులు విస్తరించి ఉండటంతో ఈ ప్రాంతం కార్మికుల నివాస కేంద్రంగా మారింది. జనాభా, ఆదాయాల ప్రాతిపదికన అప్పటి ప్రభుత్వం... 24 వార్డులతో గ్రేడ్-3 మున్సిపాలిటీగా ఏర్పాటు చేసింది. 1987లో మొదటిసారి జరిగిన ప్రత్యక్ష పురుపోరులో సీపీఎం-టీడీపీ కూటమి విజయం సాధించింది. అత్యధిక వార్డుల్లో కాంగ్రెస్ సభ్యులు గెలిచినా... ఛైర్మన్ ఎన్నికల్లో మాత్రం సీపీఎం-టీడీపీ కూటమికే ఓటర్లు పట్టంకట్టారు. అయితే, 1995లో ఛైర్మన్ ఎన్నికను పరోక్షం చేయడంతో... అప్పట్నుంచి  2014వరకు జరిగిన ఎన్నికల్లో.... వివిధ పార్టీలు ఇల్లందును ఏలాయి. అయితే, అత్యధికంగా కాంగ్రెస్‌ ఐదుసార్లు ఇల్లందు పీఠాన్ని దక్కించుకుని ఆధిపత్యాన్ని చాటుకుంది.

తెలంగాణ రాష్ట్రం ఉనికిలోకి రాకముందు... 2014 ప్రారంభంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఇల్లందును కాంగ్రెస్‌-సీపీఐ కూటమి కైవసం చేసుకుంది. టీఆర్ఎస్‌ కేవలం మూడు వార్డులకే పరిమితమైంది. అయితే, స్వరాష్ట్రం ఏర్పడ్డాక, తొలిసారి జరుగుతోన్న పురపోరులో.... ఇల్లందుపై గులాబీ జెండా ఎగురవేయాలని టీఆర్ఎస్‌ నేతలు తహతహలాడుతున్నారు. అయితే, ఇల్లందు టీఆర్ఎస్ నేతలంతా ఏకతాటి పైకి వస్తే.... గులాబీ పార్టీ గెలుపు నల్లేరు మీద నడకేనన్న మాట వినిపిస్తోంది. దాంతో, అందరినీ కలుపుకుంటూ ముందుకెళ్తోన్న ఇల్లందు టీఆర్ఎస్ నేతలు.... ఇప్పటివరకు ఆధిపత్యం చెలాయించిన కాంగ్రెస్‌ను మట్టికరిపించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.