శ్రీరామ నవమి రోజే హిజ్రాలు ఏడడుగుల బంధంలో
posted on Apr 6, 2025 6:04PM

శ్రీ రామనవమి రోజే వేములవాడ రాజన్న ను వరుడిగా భావించి హిజ్రాలు పెళ్లి చేసుకునే ఆచారం అనాదిగా వస్తోంది. ప్రతీ యేటా శ్రీ రామనవమి రోజు హిజ్రాలు రాజరాజేశ్వర స్వామికి భార్యలుగా భావించి పెళ్లి చేసుకుంటారు. హిజ్రాలంటే సమాజంలో చులకన భావం ఉంది. ఆ చులకన భావాన్ని పోగొట్టే విధంగా శ్రీరామనవమి రోజే హిజ్రాలు ఏడడుగుల బంధంలో అడుగుపెడతారు. పట్టు చీరలు, ఆభరణాలు ధరించి ముస్తాబై తలపై జీలకర్ర, బెల్లం పెట్టుకోవడం, మెడలో మంగళ సూత్రం ధరించి రాజరాజేశ్వరస్వామిని తమ భర్తగా భావించి హిజ్రాలు పెళ్లి చేసుకుంటారు. ఆలయ ఆవరణలో జరిగే ఈ ప్రక్రియను ఆత్మ వివాహం( స్వయం పరిత్యాగంగా) పరిగణిస్తుంటారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేముల వాడలోని శ్రీ రాజేశ్వర స్వామి ఆలయంలో జరిగే ఈ కళ్యాణ మహోత్సవంలో సామాన్య భక్తులతో హిజ్రాలు, జోగినులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.