ఇక ఆ హీరో మనవాడే
posted on Sep 17, 2014 9:36PM
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి, సమర్ధత కారణంగా చేజారి పోయిందనుకొన్న హీరో మోటార్ సైకిల్స్ కంపెనీ మళ్ళీ ఆంద్రప్రదేశ్ వైపే మొగ్గు చూపుతూ నిన్న ఆయన సమక్షంలోనే హైదరాబాదులో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పంద పత్రాలపై (యం.ఓ.యూ.) సంతకాలు చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మళ్ళీ పదేళ్ళ తరువాత రాష్ట్రానికి ఒక ప్రముఖ సంస్థ రావడం తనకు చాలా సంతోషం కలిగిస్తోందని అన్నారు. ఇలాగే వోల్క్స్ వ్యాగన్ కార్ల తయారీ సంస్థను కూడా రాష్ట్రానికి రప్పించడానికి కృషి చేస్తానని అన్నారు. ఇటువంటి పెద్ద పరిశ్రమలను రాష్ట్రానికి ఆకర్షించగలిగితే రాష్ట్ర విభజన కారణంగా ఎదుర్కొంటున్న ఆర్ధిక సమస్యలను అవలీలగా అధిగమించవచ్చని ఆయన అన్నారు.
హీరో మోటార్ సైకిల్స్ సంస్థ జనరల్ మేనేజర్ రాకేశ్ వశిష్ట మాట్లాడుతూ, అన్ని సజావుగా సాగినట్లయితే నేటి నుండి సరిగ్గా 18 నెలల తరువాత ఆంధ్రప్రదేశ్ లో తమ కర్మాగారం నుండి మోటార్ సైకిల్స్ తయారయి బయటకు రావచ్చునని తెలిపారు. తమ సంస్థలో ప్రత్యక్షంగా 3000మందికి పరోక్షంగా మరో 7000 మందికి ఉపాధి దొరుకుతుందని తెలిపారు.
ఈ కర్మాగారం పూర్తి స్థాయిలో పనిచేయడం మొదలుపెడితే ఏడాదికి దాదాపు 11లక్షల ద్విచక్ర వాహనాలు తయారవుతాయని అంచనా. అందుకోసం హీరో కంపెనీ మొత్తం రూ.3,100కోట్లు పెట్టుబడి పెట్టబోతోంది. దానిలో మోటార్ సైకిల్స్ తయారీ మరియు పరిశోధన విభాగంపై రూ.1,600 కోట్లు, అనుబంధ సంస్థలపై మరో రూ.1,500 కోట్లు పెట్టుబడి పెట్టబోతోంది.ఇది భారతదేశంలో ఆరవ మరియు దక్షిణ భారతదేశంలో మొట్ట మొదటి ఉత్పత్తి కేంద్రం అవుతుంది.
చిత్తూరు వద్ద గల శ్రీసిటీ సెజ్ వద్ద 600ఎకరాల స్థలం ఈ సంస్థకు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఏపీఐఐసీకి చెందిన ఈ భూములలో కొంత భాగం ప్రస్తుతం రైతుల అధీనంలో ఉంది. దానిలో వారు పంటలు సాగుచేసుకొంటున్నారు. వారిని ఆ భూముల నుండి త్వరలో ఖాళీ చేయించి హీరో సంస్థకు భూమిని అప్పగిస్తామని ఏపీఐఐసీ చైర్మన్ పీ.కృష్ణయ్య తెలిపారు.