స్నేహమేరా ఆరోగ్యం! (ఫ్రెండ్ షిప్ డే స్పెషల్)

మంచి స్నేహితుడు పక్కనుంటే మనసు బాగుంటుందనేది అందరికీ తెలిసిన మాటే! కానీ ఇప్పుడు స్నేహితులు కేవలం మన మనసుకి తోడుగా మాత్రమే కాదు... ఆరోగ్యానికి రక్షగా కూడా నిలుస్తారని నిరూపిస్తున్నాయి సవాలక్ష పరిశోధనలు. నలుగురు మంచి నేస్తాలు ఉన్నవాడి జీవితం నాలుగు కాలాల పాటు పదిలంగా ఉంటుందని చెబుతున్నారు పరిశోధకులు...

 

గుండె పదిలం: ఆ మధ్య స్వీడన్‌కు చెందిన కొందరు పరిశోధకులు దాదాపు మూడేళ్లపాటు శ్రమించి 13,600 మంది మీద పరీక్షలు సాగించి తేల్చిన విషయం ఏమిటంటే... స్నేహితులు ఉన్నవారిలో గుండెపోటు వచ్చే అవకాశం దాదాపు 50 శాతం తక్కువగా ఉంటుందట. కారణం! స్నేహితులు ఉండటం వల్ల మనలో ఉండే ఒత్తిడి శాతం తగ్గిపోతుందట. ఒత్తిడి వలన గుండె ధమనులు పూడుకుపోతుంటాయనీ, అదే ఒత్తిడిని ఇతరులతో పంచుకోవడం వల్ల, గుండె తన పని తాను సాఫీగా చేసుకుపోతుందనీ తేలింది.

 

నాజూకైన నేస్తాలు ఇప్పుడు ఎవరిని కదిపినా ఊబకాయం గురించే మాట్లాడుతున్నారు. ఊబకాయం వల్ల ఈ ప్రమాదం ఉంది, ఆ ప్రమాదం ఉంది... అంటూ తెగ ఊదరగొట్టేస్తున్నారు. కానీ మీకో సంగతి తెలుసా! మన స్నేహితులు సన్నగా ఉంటే మనం కూడా సన్నగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. 2007లో దాదాపు 12,000 మందిని ఏళ్ల తరబడి పరిశీలించి తేల్చిన అంశం ఇది. ఒక వ్యక్తి నడుము కొలత నిదానంగా అతని స్నేహితుల నడుము కొలతకి అనుగుణంగా మారిపోవడానికి 57% అవకాశం ఉందని ఈ పరిశోధన తేల్చింది. కారణం! సాధారణంగా మన నేస్తాల జీవన విధానాన్ని చూసి మనం కూడా ప్రభావితం చెందుతాం. వారి ఆహారపు అలవాట్లు, వ్యాయామపు అలవాట్లు చూసి మనం కూడా అలా మారితే బాగుండే అని అంతరాత్మ తెగ పోరుతుంటుంది. అయితే ఇది కేవలం మంచి అలవాట్ల విషయంలోనే కాదు, చెడు అలవాట్లకి కూడా వర్తిస్తుంది.

 

ఎవ్వరూ పట్టించుకోకపోయినా! కొంతమందికి చొరవ లేకపోవడం వల్లనో, మరే కారణం చేతనో కానీ అందరూ దూరం పెడుతూ ఉంటారు. దానివల్ల వారిలో ఆత్మన్యూనత పెరిగిపోతుంది. ఒత్తిడి అంతకంతకూ పేరుకుపోతుంది. కానీ ఇలాంటి వారికి ఒకరిద్దరు మంచి మిత్రులు ఉంటే, సమాజమంతా తనను వెలివేసినా తట్టుకోగలరని తేలింది. 2011లో నెదర్లాండ్స్‌కు చెందిన కొందరు పరిశోధకులు ఈ విషయాన్ని ధృవీకరించారు కూడా!

 

జీవితకాలం మెరుగుపడుతుంది:  మంచి స్నేహితులు ఉన్నవారు సుదీర్ఘకాలం జీవించే అవకాశం చాలా ఎక్కువని తేలింది. దీనికి ముఖ్యంగా రెండు కారణాలు చెబుతున్నారు. ఒకటి- స్నేహంతో ఎలాంటి ఒత్తిడినైనా అధిగమించగలడం. రెండు- తను కూడా ఈ సమాజంలో భాగం, తనని కూడా గుర్తించేవారు ఉన్నారు అన్న భావనలతో తన ఆరోగ్యం పట్ల తెలియకుండానే శ్రద్ధ వహించడం. ఇలాంటి కారణాల వల్ల రక్తపోటు అదుపులో ఉండటం, రోగనిరోధకశక్తి మెరుగుపడటం, క్రుంగుబాటు నుంచి తేరుకోవడం వంటి ఎన్నో లాభాలు చేకూరుతాయట.

 

మతిమరపు దూరం: స్నేహితులు ఎవ్వరూ లేకుండా ఒంటరితనంలో కూరుకుపోయేవారిలో మతిమరపు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందట. ఇందుకోసం 65 ఏళ్లు దాటిని ఒక 2000 మంది మీద ఒక ప్రయోగాన్ని చేశారు. వీరి మెదడు పనితీరునీ, సామాజిక సంబంధాలనీ బేరీజు వేస్తూ ఒక మూడేళ్ల పాటు అందరినీ నిశితంగా పరిశీలించారు. చివరికి తేలిందేమంటే- తాము ఒంటరితనంతో కుంగిపోతున్నమని మొదట్లో చెప్పినవారిలో 13 శాతం మంది మతిమరపు వంటి లక్షణాలతో బాధపడటం మొదలుపెట్టారు. స్నేహితులతో కలిసిమెలసి ఉండేవారు మాత్రం ఎలాంటి మతిమరపూ లేకుండా హాయిగా ఉన్నారు.

 

 

- నిర్జర.