అమ్మో! అమీబియాసిస్
posted on Aug 27, 2018 10:57AM
వర్షాకాలం వచ్చిందంటే చాలు నానారకాల క్రిములూ మన మీద దాడి చేసేందుకు సిద్ధంగా ఉంటాయి. తినే తిండిలోనూ, పీల్చేగాలిలోనూ తిరుగుతూ మనకి ఎప్పుడు హాని తలపెడదామా అని ఎదురుచూస్తుంటాయి. అలాంటి వ్యాధులలో ఒకటి అమీబియాసిస్. అమీబియాసిస్‌ను చాలామంది తేలికగా కొట్టిపారేస్తుంటారు కానీ, దీనిని అశ్రద్ధ చేస్తే కలిగే ఉపద్రవం అంతా ఇంతా కాదు.
ఇదీ కారకం!
ఏక కణ జీవి అయిన Entamoeba histolytica ద్వారా అమీబియాసిస్ సోకుతుంది. ఈ వ్యాధి సోకిన వ్యక్తుల మలంలో సదరు జీవి తాలూకు అవశేషాలు నెలల తరబడి సజీవంగా ఉంటాయి. అలాంటి మలం నీటిలో కలిసినప్పుడు కానీ, కూరగాయల వంటి ఆహారపదార్థాలను తాకినప్పుడు కానీ.. వాటితో పాటుగా మనిషి శరీరంలోకి ప్రవేశిస్తాయి.
దాడి ఇలా సాగుతుంది...
శరీరంలోకి ప్రవేశించిన అమీబా ముందు జీర్ణాశయంలో తన స్థావరాన్ని ఏర్పరుచుకుంటుంది. నిదానంగా పెద్ద పేగులలోకి చేరుకుంటుంది. అక్కడి వరకూ ఫర్వాలేదు కానీ ఒకవేళ పెద్దపేగులను కూడా దాటుకుని రక్తంలోకి కలిస్తే మాత్రం ఉపద్రవమే! ఎందుకంటే రక్తంలోకి కలిసిని అమీబా, ఆ ప్రవాహంతో పాటుగా ప్రయాణిస్తూ, శరీరంలోని అవయవాలలో వేటి మీదైనా దాడి చేసే అవకాశం ఉంది. కాలేయం మొదలుకొని మెదడు వరకూ అమీబియాసిస్ ఏ అవయవాన్నైనా పాడు చేసేయవచ్చు.
పసిగట్టేదెలా?
సాధారణంగా అమీబియాసిస్ సోకినవారిలో ఓ 10 శాతం మందిలోనే ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. వారం నుంచి నెలరోజుల లోపే ఈ లక్షణాలు బయటపడతాయి. కడుపులో నొప్పి, విరేచనాలు ఈ వ్యాధిలో బయటపడే ఇబ్బందులు. ఒకోసారి అమీబా పెద్దపేగులను గాయపరిచినప్పుడు, రక్తంతో కూడిన విరేచనాలు కూడా ఏర్పడవచ్చు.
పరీక్ష- చికిత్స
అనుభవజ్ఞులైన వైద్యులు, మనం చెప్పే లక్షణాలను బట్టి అమీబియాసిస్ సోకినట్లుగా పసిగట్టేస్తారు. మరికొన్ని సందర్భాలలో మల పరీక్ష అవసరం కావచ్చు. ఒకోసారి వ్యాధిని నిర్ధారించేందుకు రక్తపరీక్ష కూడా అవసరం అవుతుంది. మన శరీరంలో అమీబా ఉనికిని బట్టీ, అది వ్యాపించిన తీరుని బట్టి, కలిగిస్తున్న లక్షణాలను బట్టి... చికిత్స ఉంటుంది. మెట్రోనిడజోల్ వంటి చవకైన మందులకి అమీబియాసిస్ లొంగిపోతుంది. అయితే అమీబా కనుక కాలేయం వంటి అవయవాలని పాడుచేసి ఉంటే ఒకోసారి చికిత్స కూడా అవసరం కావచ్చు.
నివారణే మార్గం!
మనం ఎంతో తేలికగా కొట్టిపారేసే అమీబియాసిస్ ఒకోసారి మరణానికి కూడా దారితీయవచ్చు. ఏటా దాదాపు లక్షమంది అమీబియాసిస్ కారణంగా చనిపోతున్నారని తెలిస్తే, ఇదేమంత ఆషామాషీ వ్యవహారం కాదని తేలిపోతుంది. అసలే అభివృద్ధి చెందుతున్న ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా ఖండాలలోనే ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. పైగా అమీబియాసిస్ సోకిన తరువాత ఒకోసారి సంవత్సరాల తరబడి దాని తాలూకు ప్రభావం కనిపించవచ్చు. అందుకని అమీబియాసిస్ వచ్చాక బాధపడేకంటే పారిశుద్ధ్యం సరిగా లేని సందర్భాలలో, ముఖ్యంగా నీరూ ఆహారమూ కలుషతం అయ్యే వర్షాకాలంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచింది.
- నీటిని ఎడాపెడా ఎక్కడపడితే అక్కడ తాగేయకూడదు. కాచి చల్లార్చిన తరువాతనో, ఫిల్టర్ చేసుకున్న తరువాతనో తాగాలి. ఇలాంటి అవకాశం లేని ప్రయాణాల వంటి సందర్భాలలో మినరల్ వాటర్ మీద ఆధారపడక తప్పదు.
- పండ్లు, కాయగూరల వంటి పదార్థాలని శుభ్రంగా కడిగి లేదా చెక్కు తీసి వాడుకోవాలి.
- వర్షాకాలంలో పాలు కూడా కలుషితం అయ్యే అవకాశం ఉంది కాబట్టి... డెయిరీ నుంచి కొనుక్కునే పాశ్చురైస్డ్ పేకెట్ పాలని వాడాలి. లేదంటే కనీసం పాలని బాగా మరిగించి ఉపయోగించాలి.
- బయట ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పానీపూరీతో పాటుగా ఇచ్చే నీళ్లు, చట్నీలలో కలిపే నీళ్లు, జ్యూసులలో కలిపే ఐస్.... ఇలాంటివన్నీ కూడా అమీబాని మనకు అంటించగలిగే సాధనాలే అని గుర్తించాలి.
అన్నింటినీ మించి... వాంతులు, విరేచనాలు, జ్వరం, కడుపునొప్పి వంటి లక్షణాలు ఒకటి రెండు రోజులకి మించి విడవకుండా ఉంటే తప్పకుండా వైద్యుని సంప్రదించాలి.
- నిర్జర.