దేశంపై తిరుగుబాటుకు గుత్తుల సిద్ధం
posted on Mar 14, 2012 4:47PM
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ నాయకుడు గుత్తుల సూర్యనారాయణబాబు పార్టీపై తిరుగుబాటుకు సిద్ధపడుతున్నారు. రామచంద్రాపురం అసెంబ్లీ టిక్కెట్ ను అధిష్టానం తనకు కేటాయించకపోతే వచ్చే ఉప ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా రంగంలోకి దిగాలని ఆయన యోచిస్తున్నట్లు తెలిసింది. గత ఎన్నికల్లో గుత్తుల సూర్యనారాయణబాబు తెలుగుదేశంపార్టీ అభ్యర్ధిగా పోటీచేసి డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు. అందుకే ఈసారి ఉప ఎన్నికల్లో ఆయనకు బదులుగా వేరే అభ్యర్థిని రంగంలోకి దింపాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు భావిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గుత్తుల సూర్యనారాయణబాబును హైదరాబాద్ కు పిలిపించుకుని పరిస్థితిని వివరించి పార్టీకి సహకరించవలసిందిగా కోరారు. చంద్రబాబు అభ్యర్థనను మౌనంగా విన్న గుత్తుల తిరిగి జిల్లాకు వచ్చిన తరువాత తన అసంతృప్తిని సన్నిహితుల వద్ద వ్యక్తం చేస్తున్నారు. పార్టీ తనకు టిక్కెట్ ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి తీరుతానని ఆయన చెబుతున్నారు.