పటేల్ ఓట్ల కోసం కమల వ్యూహం.. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన భూపేంద్రే సీఎం

గుజరాత్ కొత్త ముఖ్యమంత్రిగా భూపేంద్ర భాయ్ పటేల్ ఎన్నికయ్యారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన భూపేంద్రకు ముఖ్యమంత్రి పదవి వరిస్తుందని ఎవరూ ఊహించలేదు. భూపేంద్ర పటేల్ పేరును విజయ్ రూపానీ ప్రతిపాదించగా, పార్టీ ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. పాటీదార్ కమ్యూనిటీకి చెందిన భూపేంద్ర పటేల్ 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఘాట్‌లోడియా నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. లక్షకు పైగా ఓట్ల ఆధిక్యంతో ఆయన విజయం సాధించారు. భూపేంద్ర గతంలో అహ్మదాబాద్‌లోని మెమ్నాగర్ మున్సిపాలిటీ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, అహ్మదాబాద్ అర్బన్ డవలప్‌మెంట్ అథారిటీ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. 

గుజరాత్ లో ప్రస్తుతం బీజేపీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుందనే ప్రచారం జరుగుతోంది. దీంతో వచ్చే శాసనసభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా  ముఖ్యమంత్రి మార్పు చేపట్టిందని అంటున్నారు. సీఎం పీఠాన్ని పటేల్ సామాజికవర్గానికి ఇవ్వాలని పార్టీ అధిష్టానం నిర్ణయించడంతో అనూహ్యంగా భూపేంద్ర పటేల్ పేరు తెరపైకి వచ్చింది. రాష్ట్రంలో కీలకంగా ఉన్న పాటీదార్ (పటేల్) సామాజిక వర్గాన్ని ఆకట్టుకోవడం కోసమే బీజేపీ ఈ వ్యూహానికి తెరతీసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గుజరాత్ లో పటేళ్లు బలమైన సామాజిక వర్గంగా కొనసాగుతున్నారు. రాష్ట్ర జనాభాలో దాదాపు 14 శాతం వీళ్లే. సుమారు 1.5 నుంచి 2 కోట్ల వరకు పాటిదార్ల జనభా ఉంటుందని అంచనా. రాష్ట్రంలోని మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు గాను 70కి పైగా స్థానాల్లో పటేళ్లు ప్రభావం చూపగలరు. పాటిదార్ల మద్దతుతోనే బీజేపీ రెండు దశాబ్దాలుగా గుజరాత్ లో అధికారంలో కొనసాగుతోంది. 

2015లో రిజర్వేషన్ల కోటా కోసం పటేళ్లు ఆందోళన చేశారు. ఓబీసీల్లో కలిపి రిజర్వేషన్లు ఇవ్వాలనే డిమాండ్ తో  పాటిదార్ అనామత్ ఆందోళన్ సమితి పేరుతో యువ నాయకుడు హార్దిక్ పటేల్ నాయకత్వంలో ఆందోళన జరిగింది. 5 లక్షల మందికి పైగా పటేల్ వర్గం ప్రజలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హార్దిక్ ను అరెస్టు చేయడంతో గుజరాత్ అట్టుడికిపోయింది. పటేల్ డిమాండ్ కు తలొగ్గిన ప్రభుత్వం పూర్తిస్థాయిలో దాన్ని తీర్చలేనప్పటికీ పాటిదార్ సహా ఉన్నల కులాల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్ ప్రకటించింది. ఈ ఆందోళన ప్రభావం 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీపై గట్టిగానే పడింది. 99 సీట్లు మాత్రమే గెలిచింది. గుజరాత్ చరిత్రలో ఆ పార్టీ సాధించిన అతి తక్కువ సీట్లు ఇవే. 2012 ఎన్నికల్లో 115 స్థానాల్లో గెలిచింది బీజేపీ.

హార్దిక్ పటేల్ ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారు. ఆయనకు యువత ఆదరణ ఉంది. దళిత నేత జిగ్నేశ్ మేవానీ కూడా కాంగ్రెస్ కు అండగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో గట్టెక్కాలంటే పటేల్ వర్గం మద్దతు అవసరమని బీజేపీ గుర్తించింది. విజయ్ రూపానీ జైన్ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో పాటిదార్లు ఆయన సీఎం కావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారని తెలిసింది. దీంతో దిద్దుబాటు చర్యలకు దిగిన బీజేపీ విజయ్ రూపానీని మార్చి.. భూపేంద్ర భాయ్ పటేల్ ను ముఖ్యమంత్రిగా నియమించింది. 2019 లోక్సభ ఎన్నికలకు ముందు గుజరాత్ మంత్రివర్గంలో ఆరుగురు పాటిదార్ నాయకులకు చోటు కల్పించింది. ఇటీవల కేంద్ర మంత్రివర్గ విస్తరణలోనూ గుజరాత్ కు అధిక ప్రాధాన్యం దక్కింది. పటేల్ వర్గానికి చెందిన మన్సుఖ్ మాండవీయక ఆరోగ్య శాఖ బాధ్యతలు అప్పజెప్పడంతో పాటు మరో నేత పురుషోత్తం రూపాలాను మంత్రివర్గంలోకి తీసుకుంది. రాష్ట్రంలో కరోనా కట్టడిలో వైఫల్యం జనాకర్షణ లేదనే కారణాలతో విజయ్ రూపానిని గద్దె దించినట్లు చెబుతున్నప్పటికీ.. వెనక దాగి ఉన్న వ్యూహం మాత్రం పటేల్ వర్గానికి చేరువ కావడమేనని తెలుస్తోంది.