నిరాశను మిగిల్చిన గవర్నర్ ప్రసంగం

హైదరాబాద్: ప్రజలు, చేనేత కార్మికులు, రైతులు గవర్నర్ ప్రసంగం కోసం ఎదురు చూశారని కానీ పూర్తిగా నిరాశను మిగిల్చిందని   వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం శాసనసభ్యులు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద  సోమవారం స్పష్టం చేశారు. రాష్ట్రంలో నూటికి అరవై శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని అలాంటి రైతులకు గవర్నర్ ప్రసంగంలో ఎక్కడా హామీ లేదన్నారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి నిధులు కేటాయిస్తే ఇప్పటి వరకు వాటిని పూర్తిగా విడుదల చేయలేదన్నారు. జూనియర్ డాక్టర్ల అంశం ప్రస్తావనే లేదన్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి ఏమాత్రం అవగాహన లేదన్నారు. 108ని సక్రమంగా కొనసాగిస్తామన్న హామీలు లేకపోవడం దారుణమన్నారు. దళితులకు ప్రత్యేక బడ్జెట్ అన్న ప్రభుత్వ హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. రైతుల సమస్యలపై నిర్ణయాన్ని ప్రకటించాలని పిల్లి సుభాష్ చంద్ర బోసు డిమాండ్ చేశారు.

అసెంబ్లీలో తాము ప్రతిపక్ష పాత్ర పోషిస్తామన్నారు. స్పీకర్ నాదెండ్ల మనోహర్ తన వేటు విషయంపై ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదో అర్థం కావడం లేదని మరో నేత బాలినేని శ్రీనివాస రెడ్డి అన్నారు. ఆయన ముందే మేము విప్ ధిక్కరించి ప్రభుత్వానికి ఓటు వేశామని, అయినప్పటికీ ఇంత జాప్యం చేయడంలో అర్థం లేదన్నారు. ఇప్పటికైనా స్పీకర్ తమపై సరైన నిర్ణయం త్వరగా తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఒకేసారి 24 నియోజకవర్గాల్లో ఎన్నికలు వస్తే ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుందని భావించే ప్రభుత్వం వేటుకు వెనుకాడుతున్నట్లుగా కనిపిస్తోందన్నారు.