ఏపీ ఎన్నికల పంచాయతీ ద్వివేది మెడకు చుట్టుకోనుందా...! 

ఏపీ రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘాల మధ్య నడిచిన వివాదం మధ్యలో పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది మెడకు చుట్టుకోనుందా.. అంటే అవుననే అంటున్నాయి అధికార వర్గాలు. గతంలో చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌గా పని చేసిన ద్వివేది. కారణమేదైనప్పటికీ.. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ ఆదేశాలను అయన ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారు. దీంతో అయన తీవ్రమైన పర్యవసానాలను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేవలం బదిలీతోనే సరిపెట్టకుండా... గోపాలకృష్ణ ద్వివేదీతో పాటు పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజాశంకర్‌ ల పై అభిశంసన ప్రొసీడింగ్స్‌ను ఎస్‌ఈసీ జారీ చేశారు.

 

ద్వివేదీపై వచ్చిన ప్రధాన అభియోగం.. కొత్త ఓటర్ల జాబితాను సిద్ధం చేయకపోవడం. సాక్షాత్తు హైకోర్టుకు మాట ఇచ్చి కూడా ఆయన 2021 జాబితా ప్రకారం.. కొత్త ఓటర్ల లిస్ట్‌ను ప్రకటించలేదు. దీంతో అర్హులైన యువ ఓటర్లకు ఓటు హక్కు లేకుండా పోయిందని… దీనికి బాధ్యత అంతా ద్వివేదీనేనని నిమ్మగడ్డ విడుదల చేసిన అభిశంసన ప్రొసీడింగ్స్‌లో స్పష్టం చేశారు. అభిశంసన ప్రొసీడింగ్స్ లో ద్వివేదిపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ.. భారత ప్రజాస్వామ్యాన్ని బలహీనం చేసే ప్రయత్నం చేశారని నిమ్మగడ్డ ఆరోపించారు. అంతేకాకుండా తన ప్రొసీడింగ్స్.. ద్వివేదీ సర్వీస్ రికార్డుల్లో పొందు పరచాలని అయన స్పష్టం చేశారు. అదే సమయంలో వారు ఎన్నికల విధులు నిర్వహంచడానికి అర్హులు కాదని స్పష్టం చేశారు.

 

దీంతో నిమ్మగడ్డ మాత్రమే కాకుండా ద్వివేదీపై హైకోర్టు కూడా ధిక్కరణ చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. 2019 ఓటర్ల జాబితా ఆధారంగా తనకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం లేకుండాపోయిందని.. గుంటూరుకు చెందిన అఖిల అనే యువతి హైకోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సోమవారం హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ సమయంలో… పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ద్వివేదీ నిర్లక్ష్యాన్ని ప్రత్యేక అఫిడవిట్ రూపంలో ఎస్‌ఈసీ కోర్టుకు సమర్పించే అవకాశం ఉంది. మరోపక్క డివిజన్ బెంచ్ విచారణ సమయంలో.. కొత్త ఎన్నికల జాబితా ప్రకటిస్తామని ప్రభుత్వం కోర్టుకు హామీ ఇచ్చింది కానీ అలా ప్రకటించలేదు. దీంతో విచారణలో ఈ అంశం కూడా ధర్మాసనం కనుక పరిగణనలోకి తీసుకుంటే.. ద్వివేదీకి కష్టాలు తప్పవని అధికార వర్గాలలో చర్చ నడుస్తోంది. మొత్తానికి ఇటు ఎస్ఈసీ, అటు జ‌గ‌న్ మ‌ధ్య ద్వివేదీ న‌లిగిపోయార‌ని… దీంతో ఆయ‌నే బ‌ల‌య్యేలా ఉన్నార‌న్న అభిప్రాయం న్యాయ‌నిపుణుల్లో వ్య‌క్త‌మ‌వుతుంది.