63 అడిగితే.. 7.5 శాతమే ఫిట్మెంట్ ! టీఎస్ ఉద్యోగులకు పీఆర్సీ కమిటి షాక్
posted on Jan 27, 2021 11:15AM
ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్న తెలంగాణ ఉద్యోగులకు ఊహించని షాక్ తగిలింది. సుదీర్ఘ కాలంగా పోరాడుతున్న తమకు మంచి జరుగుతుందనకుంటున్న వారి ఆశలపై నీళ్లు చల్లింది పీఆర్సీ కమిటి. ఉద్యోగుల మూల వేతనంపై 7.5 శాతం ఫిట్‌మెంట్ మాత్రమే ఇవ్వాలని సిఫారస్ చేస్తూ.. తెలంగాణ తొలి వేతన సవరణ సంఘం నివేదిక ఇచ్చింది. పదవీ విరమణ వయస్సును 60 ఏళ్లకు పెంచాలని ప్రతిపాదించింది. కనీస వేతనం రూ. 19 వేలు, గరిష్ట వేతనం రూ. 1,62,700లుగా వేతన సవరణ కమిషన్ సూచించింది. సీపీఎస్ ఉద్యోగుల కుటుంబాలకు పెన్షన్ ను ఇవ్వాలని రికమండ్ చేసింది. 32 నెలలపాటు కొనసాగిన అధ్యయనం గత నెల 31న సీఎస్‌కు అందించింది. దీన్ని దాదాపు 28 రోజుల పాటు సీల్డ్ కవర్లోనే ఉంచిన అధికారులు.. బుధవారం ఉదయం విడుదల చేశారు. హెచ్‌ఆర్‌ఏ శ్లాబుల్లో మార్పులు చేసింది. 11, 13, 17,24గా నిర్ణయించారు. గతంలో 12,14,20,30 శాతంగా శ్లాబులు ఉన్నాయి.
వాస్తవంగా ఉద్యోగులు మాత్రం 63 శాతం ఫిట్ మెంట్ అడిగారు. ఇందుకోసం పోరాటాలు కూడా చేశారు. 63 శాతం అడిగితే కనీసం 40 శాతమైనా ఇస్తారని భావించారు. గత ఏడాది జూలైలోనే ఏపీ ప్రభుత్వం.. అక్కడి ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ప్రకటించింది. దీంతో తమకు అంతకంటే ఎక్కువే వస్తుందని తెలంగాణ ఉద్యోగులు భావించారు. కాని పీఆర్సీ కమిటి మాత్రం కేవలం 7.5 శాతం ఫిట్ మెంటే సిఫారస్ చేసింది. హెచ్‌ఆర్‌ఏ తగ్గించాలని, గ్రాట్యూటీ పరిమితి రూ. 12 లక్షల నుంచి రూ.16 లక్షలకు పెంచాలని సూచించింది. శిశు సంరక్షణ సెలవులు 90 నుంచి 120 రోజులకు పెంపుదల చేయాలని కోరింది. సీపీఎస్‌లో ప్రభుత్వ వాటా 14 శాతానికి పెంచాలని సర్కార్ కు పీఆర్సీ కమిటి సిఫారస్ చేసింది.
పీఆర్సీ కమిటి సిఫార్సు చేసిన అంశాలను రాతపూర్వకంగా ఉద్యోగ సంఘాలకు ఇవ్వనున్నారు సీఎస్, బుధవారం నుంచి 13 గుర్తింపు సంఘాలతో సీఎస్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ చర్చలు జరపనుంది. ఇందులో టీఎన్జీవో, టీజీవో, రెవెన్యూ సంఘాలు, పలు టీచర్ల సంఘాలు, ఫోర్త్ క్లాస్ ఎంప్లాయిస్, డ్రైవర్ల యూనియన్ ఉన్నట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. చర్చలకు అటెండ్ అయిన అన్ని సంఘాల సలహాలు, సూచనలు, అభిప్రాయాలు తీసుకున్న తరువాత సీఎస్ సోమేశ్ కుమార్ ఆధ్వర్యంలోని త్రిసభ్య కమిటీ సీఎం కేసీఆర్‌కు బ్రీఫ్ నోట్ ఇవ్వనుంది. ఈ నెలాఖరులో సీఎం కేసీఆర్ ఉద్యోగ సంఘాలతో చర్చించి పీఆర్సీ ఫిట్ మెంట్ ప్రకటించనున్నారు. వారం, పది రోజుల్లో చర్చలు పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించటంతో ఉన్నతాధికారులు ప్రాసెస్‌ను స్పీడప్ చేశారు.
2018 జులై 1 నుంచి ఈ వేతన సవరణ అమలుకు కమిషన్ సిఫార్సు చేసింది. ఉద్యోగుల పీఆర్సీపై రాష్ట్ర ప్రభుత్వం 2018 మే 18 న సీఆర్ బిశ్వాల్ చైర్మన్ గా మహ్మద్ ఆలీ రఫత్, ఉమా మహేశ్వరావులతో కమిషన్ ఏర్పాటు చేసింది. కమిషన్ గడువును ప్రభుత్వం మూడు సార్లు పెంచింది. చివరగా 2020 ఫిబ్రవరిలో పెంచింది. రిపోర్ట్ అందజేయాలని సీఎం ఆదేశించడంతో 31 నెలల స్టడీ తరువాత 2020 డిసెంబర్ 31 న సీఎస్ సోమేశ్ కుమార్ కు అందచేసింది. పీఆర్సీ కమిటి సిఫారసులపై ఉద్యోగులు భగ్గుమంటున్నారు. 32 నెలల పాటు కసరత్తు చేసి ఇంత తక్కువగా సిఫారస్ చేయడమేంటని మండిపడుతున్నారు. తమకు గౌరవప్రదమైన ఫిట్మెంట్ ప్రకటించకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.