మూడు నెలల వరకు మంచి రోజులు లేవ‌ట‌! శుభముహూర్తాలకు బ్రేక్!

సాధార‌ణంగా ఎలాంటి శుభ‌కార్యాలు జ‌ర‌గాల‌న్న మంచి ముహూర్తాలు ఉండాల్సిందే. మంచి ముహుర్తాలు లేకుంటే శుభ‌కార్యాలు చేయ‌రు. ప్ర‌స్తుతం మూఢ‌మి వ‌చ్చేసింది. మూడు నెల‌ల వ‌ర‌కు శుభ‌కార్యాల‌కు విరామం అనే చెప్ప‌వ‌చ్చు. దీంతో ప‌లు రంగాల వారిపై ప్ర‌భావం ప‌డ‌నుంది. ఎటువంటి శుభకార్యాలకు ముహూర్తాలు లేవని పండితులు తేల్చారు. ఈ మూడు నెలలు వైశాఖ, జ్యేష్ట, ఆషాడ మాసాలు కావడంతో ముహుర్తాలు లేవని పండితులు చెబుతున్నారు. దీంతో పెళ్లిళ్లతో పాటు నూతన గృహ ప్రవేశాలు, దేవతా విగ్రహ ప్రతిష్టాపనలు, శంకుస్థాపనల వంటి కార్యాలకు విరామం వచ్చింది. నిన్న‌టి నుంచి అదే.... ఏప్రిల్‌ 29 నుంచి ఆగస్టు 8వరకు, మూడు నెలలపాటు వైశాఖ, జ్యేష్ట, ఆషాఢ మాసాల్లో గురు, శుక్ర మౌఢ్యమి వల్ల సుముహూర్తాలు లేవ‌ని వేద పండితులు తేల్చిప‌డేశారు. అంతే ఇక  వివాహాలతో పాటు నూతన గృహ ప్రవేశాలు, దేవతా విగ్రహ ప్రతిష్ఠాపనలు, శంకుస్థాపనల లాంటి శుభకార్యాలను జరపడం సాధ్యం కాదు. మంచి రోజులు రావాలంటే, మూడు నెల‌లు ఆగాల్సిందేన‌ట‌. 

శుభకార్యాలకు బ్రేక్‌ పడటంతో పూలు, పండ్లు లాంటివి అమ్ముతూ జీవనం సాగించే చిరు వ్యాపారుల ఉపాధిపై ప్రభావం వుంటుంది. అలాగే బాజా భజంత్రీలు, డప్పు వాయిద్యాలు, డీజేలు, బారాత్‌లు నిర్వహించే కళాకారుల ఉపాధికి కూడా మూడు నెలలపాటు గండిపడిన‌ట్లే.  పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు ఆగిపోయినట్టే. ఈ మూడు నెలల పాటు వంటల వారు, పూల అలంకరణ చేసేవాళ్లు, క్యాటరింగ్ సిబ్బంది, లైటింగ్ డెకరేషన్ వారు, పెళ్లిముంతలు చేసే స్కిల్ వర్కర్లు, ప్రైవేటు కల్యాణ మండపాల యజమానులు విశ్రాంతి తీసుకోవాల్సిందే. వీరితో పాటు బంగారం, వస్త్రదుకాణాలు వెలవెల బోయే పరిస్థితులు నెలకొన్నాయి.  ఇక‌ ఫంక్షన్‌ హాళ్ల నిర్వాహకుల‌కు గిరాకీ లేక ఈగ‌లు తోలుకోవాల్సిందే. క‌నీసం మెయింట్‌నెన్స్‌ చార్జీలు కూడా రావని ఫంక్ష‌న్ హాళ్ల నిర్వాహ‌కులు తెగ బాధ‌ప‌డిపోతున్నారు.  ప్రతి సంవత్సరం మే నెలలో అత్యధిక వివాహాలు జరుగుతుంటాయి. కానీ, ఈ సారి ఆ అవకాశం లేదు. సోమవారం నుంచే శుభకార్యాలకు బ్రేక్‌ పడింది. 

సూర్యకాంతి గురు, శుక్ర గ్రహాలపై పడి ఈ మౌఢ్యమి సంక్రమిస్తుందని ఈ సమయంలో ఆయా గ్రహాల గమనం తెలియక శుభ ముహుర్తాలు పెట్టడం సాధ్యం కాని పురోహితులు చెబుతున్నారు.  మూడాల కారణంగా   ముఖ్యంగా శుభ‌కార్యాల‌కు గురు, శుక్ర గ్ర‌హాల బ‌లం ముఖ్యం. ఆ రెండు గ్ర‌హాలు సూర్యుడికి ద‌గ్గ‌ర‌గా వ‌చ్చిన‌ప్పుడు వాటి శ‌క్తిని కోల్పోయి బ‌ల‌హీన‌మ‌వుతాయి. కాబ‌ట్టి అలాంటి స‌మ‌యం, ఎటువంటి శుభ‌కార్యాల‌కు ప‌నికి రాద‌ని పంచాగ క‌ర్త‌లు చెబుతున్నారు.  మంచి రోజులు రావాలంటే, మూడు నెల‌లు ఆగాల్సిందేన‌ట‌.

- ఎం.కె.ఫ‌జ‌ల్‌