TDP కూట‌మిలో రెట్టించిన జోష్‌! సంక్షేమం-అభివృద్ధి వైపే ఏపీ ఓట‌ర్!

టీడీపీ సంక్షేమ ప‌థ‌కాల ముందు జ‌గ‌న్ న‌వ‌ర‌త్నాలు వెల‌వెల పోతున్నాయి. గ‌తంలో జ‌గ‌న్‌కు ఓటు వేసిన వారంతా ఇప్పుడు కూట‌మి మేనిఫెస్టో కే జై అంటున్నారు. ముఖ్యంగా పెన్షన్లు రూ.4 వేలకు పెంపు, ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం మొత్తం ఏపీ రాజ‌కీయ ముఖ‌చిత్రాన్నే మార్చివేసింది. వాస్త‌వానికి ప్ర‌జ‌లు ఎప్పుడూ, సంక్షేమంతో పాటు అభివృద్ధినే కోరుకుంటారు. కానీ గ‌త ఐదేళ్ళ‌ల్లో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఎక్క‌డా అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌లేదు. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచివేసిందనే అస‌హ‌నం ఏపీ ప్ర‌జ‌ల్లో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.  ఆ అస‌హ‌న‌మే ఇప్పుడు ఓట్ల రూపంలో చూప‌నున్నారు. జ‌గ‌న్ పాల‌న‌కు ఈ ఎన్నికలు రెఫరెండం అని చెప్ప‌వ‌చ్చు.   తన వల్ల మేలు జరిగితేనే తనకు ఓటేయాలని.. లేకుంటే వద్దని ఆయ‌నే చెబుతున్నాడు. కేవ‌లం సంక్షేమ పథకాలనే జగన్ నమ్ముకున్నారు. 

మ‌రోవైపు.. రాష్ట్రంలో అభివృద్ధి లేద‌ని.. అమ‌రావ‌తిని విధ్వంసంచేశార‌ని.. రాష్ట్రానికి పెట్టుబ‌డులు రా కుండా చేశార‌ని.. దీని వ‌ల్ల రాష్ట్రం 30 ఏళ్ల‌పాటు వెన‌క్కి వెళ్లిపోయింద‌ని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ చెబు తోంది. దీనినే ప్ర‌చారం కూడా చేస్తోంది. అదేస‌మ‌యంలో జ‌గ‌న్ ప‌థ‌కాల‌కు మించి, సంక్షేమ ప‌థ‌కాలు ఇస్తామ‌ని టీడీపీ చెబుతోంది. చంద్ర బాబుతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యం అంటూ కూటమి విస్తృతంగా ప్ర‌చారం చేస్తోంది. తెలుగుదేశం అంటేనే సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేసే పార్టీ. బలమైన అభ్యర్థులను బరిలోకి దింపింది. ప్రజాగళం పేరుతో చంద్ర‌బాబు ప్రజల్లోకి వెళ్లి విస్తృత ప్ర‌చారం చేస్తున్నారు. జ‌గ‌న్‌ ప్ర‌భుత్వం కంటే, మెరుగైన సంక్షేమం అందిస్తామ‌ని కూట‌మి మేనిఫెస్టో విడుద‌ల చేసింది. కూట‌మి సంక్షేమ ప‌థ‌కాల ప్ర‌క‌ట‌న‌తో మొత్తం ఏపీ రాజ‌కీయ ముఖ‌చిత్రం మారిపోయింది. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం అత్యంత ఆసక్తికరంగా సాగుతోంది. అధికార, విపక్ష కూటమి ఎత్తుకు పైఎత్తులు వేసుకుంటూ రాజకీయాన్ని మరింత రక్తి కట్టిస్తున్నాయి.

ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఏపీకి ఎలాంటి నాయ‌కుడు అవ‌స‌రం అనేదే, ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌గా మారింది. అదే జ‌నం మాట్లాడుకుంటున్నారు.  జ‌గ‌న్ ఐదేళ్ల పాల‌న‌, అలాగే చంద్ర‌బాబు 14 ఏళ్ల పాల‌న‌...వీరిలో ఎవ‌రు స‌రైన నాయ‌కుడో ఏపీ ప్ర‌జ‌లు ఈ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తీర్పు ఇవ్వ‌నున్నారు.

 - ఎం.కె.ఫ‌జ‌ల్‌