బ్యాటరీలు కాదు.. బంగారం
posted on May 18, 2015 1:28PM

శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అంటూవుంటారు. ఇలాగే బంగారం స్మగ్లర్లు కూడా కస్టమ్స్ అధికారులకు దొరకకుండా బంగారం అక్రమ రవాణా చేయడం కోసం రకరకాల మార్గాలను అన్వేషిస్తూ వుంటారు. చాలాసార్లు వాళ్ళు సక్సెస్ అవుతూ వుంటారు. ఒక్కోసారి మాత్రం అడ్డంగా దొరికిపోతూ వుంటారు. ఇలాంటి సంఘటన సోమవారం నాడు శంషాబాద్ విమానాశ్రయంలో జరిగింది. అబుదాబి నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు బోలెడన్ని సెల్‌ఫోన్లను తనవెంట తెచ్చుకున్నాడు. సెల్‌ఫోన్లే కదా అని అధికారులు వాటన్నిటినీ బయటకి తీసుకెళ్ళడానికి అనుమతి ఇచ్చారు. అయితే చివరి క్షణాల్లో ఎందుకో అనుమానం వచ్చి సెల్‌ఫోన్లను తెరిచి చూస్తే, సెల్‌లో బ్యాటరీల స్థానంలో బంగారు బిస్కెట్లు పెట్టి వున్నాయి. దాంతో బిత్తరపోయిన కస్టమ్స్ అధికారులు ఆ బంగారాన్ని, సదరు స్మగ్లర్ని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం రెండు కిలోల బంగారం పట్టుబడినట్టు తెలుస్తోంది.