42 ఏళ్ళ కోమా ముగిసింది...

 

42 సంవత్సరాల క్రితం ఒక అన్యాయాన్ని ఎదిరించిన అరుణా షాన్‌బాగ్ అనే మహిళ అత్యాచారానికి గురై, షాక్‌లో కోమాలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ మహిళ మరణించింది. 26 ఏళ్ళ వయసులో కోమాలోకి వెళ్ళిపోయిన ఆమె 42 సంవత్సరాల తర్వాత ఆమెకు 68 సంవత్సరాల వయసులో ముంబైలోని కింగ్‌ అడ్వర్డ్స్ మెమోరియల్‌ (కెఇఎమ్‌) ఆస్పత్రిలో సోమవారం మరణించింది. ఆమె ఇదే ఆస్పత్రిలో నర్సుగా పనిచేసేది. ఆస్పత్రిలో మందులను సోహన్‌లాల్ అనే వార్డు బాయ్‌ దొడ్డిదారిన అమ్ముకుంటూ వుండటాన్ని గమనించిన అరుణా షాన్‌బాగ్ ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని చెప్పింది. దాంతో ఆ వార్డు బాయ్ ఆమె మీద అత్యాచారం జరిపి, తీవ్రంగా గాయపరిచాడు. దాంతో ఆమె కోమాలోకి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఆమె కోమాలోనే వుంది. సుదీర్ఘంగా కోమాలో వున్న అరుణా షాన్‌బాగ్‌కి కారుణ్య మరణాన్ని ఇవ్వాలని ఆమె మీద ఒక పుస్తకాన్ని రాసిన పింకీ విరానీ అనే రచయిత్రి సుప్రీంకోర్టును అభ్యర్థించారు. అయితే అరుణా షాన్‌బాగ్‌ను కంటికి రెప్పలా కాపాడుకుంటామని కింగ్‌ అడ్వర్డ్స్ మెమోరియల్‌ (కెఇఎమ్‌) సిబ్బంది సుప్రీం కోర్టుకు హామీ ఇవ్వడంతో కోర్టు ఆమెకు కారుణ్య మరణాన్ని ఇవ్వడానికి నిరాకరించింది. ఇప్పుడు అరుణా షాన్‌బాగ్ కన్నుమూసింది.