బెజవాడలో తుపాకులతో బెదిరించి భారీ దోపిడి..

నవ్యాంధ్ర రాజధానికి అతి సమీపంలో ఉంటే విజయవాడ ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు బాగా ఊపందుకున్నాయి. ఇప్పుడిప్పుడే రాజధానికి కావాల్సిన అన్ని హంగులను అద్దుకుంటోంది. అలాగే క్రైమ్ రేటు కూడా అలాగే పెరిగిపోతుంది. తాజాగా జరిగిన భారీ దోపిడి బెజవాడ వాసులను భయాందోళనకు గురిచేసింది. నిన్న రాత్రి 10 గంటల సమయంలో 10 నుంచి 12 మంది దుండగులు బీసెంట్‌ రోడ్‌లో బంగారు నగలు తయారు చేసే కార్ఖానాలోకి తుపాకులు, కత్తులతో చొరబడిన ఆగంతకులు అక్కడ పనిచేసే వారిని ఒకచోటకు చేర్చి చేతులు పైకెత్తించి కూర్చోవాలని బెదిరించి..అక్కడ ఉన్న సుమారు ఏడు కిలోల నగలు బ్యాగులోకి సర్దుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు..వెంటనే తేరుకున్న కొందరు సిబ్బంది దుండగులను వెంబడించారు. వారిని గమనించిన దుండగులు కార్ఖానా సమీపంలో నిలిపి ఉంచిన కారులోకి ఎక్కిపారిపోయారు..

 

దీనిని గమనించిన కానిస్టేబుల్ బైక్‌పై కారును వెంబడించారు. అయినా ఫలితం లేకుండా పోయింది..వెంటనే అప్రమత్తమైన విజయవాడ పోలీసులు..గుంటూరు జిల్లా పోలీసులకు సమాచారం అందించడంతో వారు తాడేపల్లి పాత టోల్‌గేట్ సమీపంలో తనిఖీలు చేపట్టారు. దీనిని గుర్తించిన దుండగులు కారును రోడ్డుపై వదిలి పొలాల్లోకి పారిపోయారు. అనంతరం కారును పరిశీలించిన పోలీసులకు అందులో రెండు రౌండ్ల బుల్లెట్లు తప్ప మరేం లభించలేదు. కొందరు దుండగులు మార్గమధ్యంలోనే బంగారంతో దిగిపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. సీసీ కెమెరా ఫుటేజీ సాయంతో నిందితులను గుర్తిస్తున్నారు..దోపిడికి వచ్చిన వారంతా హిందీలోనే మాట్లాడరని..అంతా 25 నుంచి 30 ఏళ్లలోపు యువకులేనని కార్ఖానా సిబ్బంది తెలిపారు. మరోవైపు సినీ ఫక్కీలో జరిగిన ఈ దోపిడి బెజవాడ పరిసర వాసుల్ని కలవరానికి గురిచేస్తుంది.