పట్టిసీమ ద్వారా గోదావరి జలాల విడుదల!

పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా మంత్రి నిమ్మల రామానాయుడు గోదావరి జలాలను విడుదల చేశారు.  ఒక వైపు వర్షాభావ పరిస్థితి, మరో వైపు నిండుకున్న జలాశయాలతో ప్రశ్నార్థకంగా మారిన కృష్ణా డెల్టా భవిష్యత్.. ఈ తరుణంగా గతంలో చంద్రబాబు ఎంతో ముందు చూపుతో కేవలం ఏడాది వ్యవధిలో పూర్తి చేసిన పట్టిసీమ ఎత్తిపోతల పథకమే డెల్టారైతాంగానికి ఆశాదీపంగా మారింది.

గోదావరి పరీవాహక ప్రాంతాలలో కురిసిన వర్షాలతో గోదావరి ప్రవాహం పెరిగిన నేపథ్యంలో పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీరందించేందుకు తెలుగుదేశం కూటమి సర్కార్ నడుంబిగించింది. బుధవారం ( జులై 3) ఉదయం రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పట్టి సీమ ద్వారా నీటిని విడుదల చేశారు. ఈ నీరు రెండుమూడు రోజలలో ప్రకాశం బ్యారేజీ ఎగువన ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణా జలాలలో కలుస్తుంది. పట్టిసీమ నీటి విడుదల కృష్ణా డెల్టా రైతుల సాగునీటి కష్టాలను తీర్చనుంది. 

 పట్టిసీమతో పాటు గోదావరి డెల్టాలోని తాడిపూడి, పురుషోత్తమ పట్నం ప్రాజెక్టులకు నీటి పంపింగ్‌ను మంత్రి రామానాయుడు ప్రారంభించారు. 2014లో ప్రారంభమైన పోలవరం కుడికాల్వ పనుల్ని ఏడాదిలోపే పూర్తి చేవారు. 2015లో తొలిసారి పట్టిసీమ ద్వారా నీటిని విడుదల చేశారు. తొలి ఏడాది అంటే 2015-16లొ 8.50టిఎంసీల గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తరలించారు. 2016-17లో 55.60టిఎంసీలు, 2017-18లొ 105 టిఎంసిలను తరలించారు. 2018-19లో 26.88టిఎంసిలను తరలించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగేళ్ల పాటు పట్టిసీమ ప్రాజెక్టును వినియోగించలేదు.   పులిచింతల వద్ద కృష్ణా జలాలను నిల్వ చేసి గోదావరి నీటిని వాడుకునే అవకాశం ఉన్నా నిర్లక్ష్యం చేశారు. గత ఏడాది ఎగువ నుంచి నీటి విడుదల లేకపోవడంతో తప్పని సరి పరిస్థితుల్లో పట్టిసీమ నుంచి నీటిని విడుదల చేశారు. 2023-24లో 33టిఎంసిలను విడుదల చేశారు. గతేడాది ఆగస్టు 11న పట్టిసీమ ఎత్తిపోతలతో నీటి తరలింపు ప్రారంభించినా నెల రోజులకే నిలిపివేశారు. గోదావరిలో పుష్కలంగా జలాలు ఉన్నా.. డెల్టాకు అవసరం ఉన్నా.. పట్టిసీమను పూర్తి స్థాయి సామర్థ్యాన్ని వినియోగించుకో లేదు.  

పట్టిసీమ ద్వారా కృష్ణాడెల్టాకు సాగునీరు అందిస్తే.. ఆ క్రెడిట్ అంతా చంద్రబాబుకు దక్కుతుందన్న దుగ్ధతోనే కృష్ణా డెల్టా ఎండిపోతున్నా జగన్ సర్కార్ చోద్యం చూసింది తప్ప.. రైతాంగాన్ని ఆదుకునేందుకు నీటిని మాత్రం విడుదల చేయలేదు.