అమెరికా మాజీ అధ్యక్షుడు, నోబెల్ శాంతి పురస్కార గ్రహీత జిమ్మీకార్టర్ కన్నుమూత
posted on Dec 30, 2024 10:09AM
అమెరికా మాజీ అధ్యక్షుడు, నోబెల్ శాంతి పురస్కార గ్రహీత జిమ్మీ కార్టర్ కన్నుమూశారు. ఆయన వయసు వంద సంవత్సరాలు.. కార్టర్ జార్జియాలోని ప్లెయిన్స్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1977 నుంచి 1981 వరకు అమెరికా అధ్యక్షుడిగా పని చేసిన జిమ్మీ కార్టర్ శాంతి, మానవ హక్కుల పరిరక్షణ కోసం జీవితాంతం పోరాడారు.
1924 అక్టోబర్ 1న జన్మించిన జిమ్మీ కార్టర్.. ఈ ఏడాది తన వందో జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మానవ హక్కులు, సామాజిక న్యాయం వంటి అంశాల పట్ల ఎంతో నిబద్ధతతో పని చేశారు. ఇజ్రాయెల్-ఈజిప్ట్ మధ్య శాంతి ఒప్పందం కుదరడంలో కీలకంగా వ్యవహరించారు.
అధ్యకుడిగా దిగిపోయిన తర్వాత 1982లో ‘కార్టర్ సెంటర్’ను స్థాపించిన జిమ్మీ కార్టర్ సామాజిక, ఆర్థిక న్యాయం కోసం అవిశ్రాంతంగా శ్రమించారు. ఆయన కృషికి గుర్తింపుగా 2002 నోబెల్ జిమ్మీ కార్టర్ ను శాంతి బహుమతి వరించింది. న్యాయం, ప్రేమ వంటి ప్రాథమిక క్రైస్తవ సిద్ధాంతాలు తన అధ్యక్ష పదవికి పునాదిగా నిలిచాయని పలు సందర్భాల్లో జిమ్మీ కార్టర్ చెప్పారు. నేవీ ఉద్యోగిగా, గవర్నర్‌గా, అధ్యక్షుడిగా అన్నింటికీ మించి ఓ మానవతావాదిగా జిమ్మీ కార్టర్ మానవాళికి చేసిన సేవలు విస్మరించలేనివి.