పెద్దల సమాధుల మధ్య దీపావళి!
posted on Nov 1, 2024 10:13AM
దేశ వ్యాప్తంగా దీపావళి పండుగను జనం ఘనంగా జరుపుకున్నారు. దీపావళికి ఒక రోజు ముందు అంటే బుధవారం (అక్టోబర్ 30) నరకచతుర్దశి నుంచే బాణసంచా పేలుస్తూ సంబరాలు చేసుకున్నారు. నివాసాలను, వ్యాపార ప్రాంగణాలను దీపాలతో అలంకరించి ఘనంగా దీపాల పండుగ జరుపుకున్నారు. అయితే కరీనగర్ లో కొందరు వారి సంప్రదాయాన్ని అనుసరించి మరు భూమిలో దీపావళి పండుగ జరుపుకున్నారు.
కరీంనగర్ లోని కార్ఖానా గడ్డలో నివాసం ఉండే కొన్ని కుటుంబాలు తమ దీపావళి వేడుకను శ్మశానంలో చేసుకున్నారు. తమ పెద్దల సమాధుల మధ్య దీపావళి సంబరాలు నిర్వహించుకున్నారు. ఏటా దీపావళి వేడుకను తమ పెద్దల సమాధుల మధ్యే జరుపుకుంటామని వారు తెలిపారు. సాయంత్రం అయ్యే సరికి శ్మశానం చేరుకుని తమ పెద్దల సమాధులను శుభ్రం చేసి పూలతో అలంకరించి అక్కడే బాణసంచా పేల్చి పండుగ జరుపుకొంటారు.