హృదయ విదారకరం... తల్లి శవం పక్కనే పడుకున్న చిన్నారి...
posted on Jun 10, 2017 3:03PM
.jpg)
హైదరాబాద్ నగరం ఘట్ కేసర్ రైల్వేస్టేషన్లో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఓ పనికందు తన తల్లి మరణించడంతో ఏడ్చి... ఏడ్చి ఆమె శవంపైనే పడుకుండిపోయాడు. ఇది చూసిన అక్కడి వారి మనసు ద్రవించింది. వివరాల ప్రకారం... ఘట్‌కేసర్ రైల్వేస్టేషన్ లో 35 ఏళ్ల వయసున్న ఓ మహిళ రెండేళ్ల వయసున్న కుమారుడితో రైల్వేస్టేషన్‌లో అడుగుపెట్టింది. ఫ్లాట్‌ఫాంపైకి చేరుకుంటూనే మూర్ఛవ్యాధితో ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు విడిచింది. ఇక ఈ విషయం తెలియని చిన్నారి.. ఆమె మృతదేహం వద్దనే కూర్చొని ఏడవడం ఆరంభించాడు. ఆకలి వేయడంతో తన తల్లి దగ్గర పాలు తాగడానికి ప్రయత్నించాడు. అయినా కూడా ఆమె లేవకపోవడంతో పరిస్థితి గమనించిన ఇతర ప్రయాణికులు అక్కడికి వెళ్లి చూడగా ఆమె మరణించినట్టు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. ఇక చిన్నారికి పాలు, బిస్కెట్లు ఇచ్చి సముదాయించాలని చూసినా.. అలాగే గంటల తరబడి వెక్కివెక్కి ఏడ్చి.. చివరికి తల్లి మృతదేహం పక్కనే వేకువజాము వరకు నిద్రపోయాడు.
ఇక ఘట్‌కేసర్ సీఐ బి.ప్రకాష్, ఎస్సై చంద్రశేఖర్ ఘటనా స్థలికి చేరుకుని మూర్ఛ కారణంగా మహిళ మృతి చెందినట్టు రైల్వే పోలీసులకు సమాచారమిచ్చారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి బాలుడిని తమ సంరక్షణలో ఉంచుకున్నారు. మృతురాలి ఆచూకీ తెలిసిన వారు సికింద్రాబాద్ రైల్వే పోలీసులను సంప్రదించాలని సూచించారు.