ఇక తెలుగుదేశం గెలుపు ‘గంట’ల మోతేనా?

గంటా ఎక్కడుంటే గెలుపు అక్కడ ఉంటుంది. ఒకవేళ అలా జరగకపోతే.. గెలుపు ఉన్న దగ్గరకే గంటా వెళ్తారు. గెలుపుకి, గంటాకి ఉన్న అవినాభావ సంబంధం అలాంటిది. గెలుపు గంటల మోత వినకపోతే గంటా శ్రీనివాసరావుకు నిద్రపట్టదు అనుకుంటా. అదేంటో విజయం కూడా ఆయన దగ్గరకు గెంతుకుంటూ వస్తుంది. 2004 లో తెలుగుదేశం తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 2009 ఎన్నికలకు ముందు ప్రజారాజ్యంలోకి జంప్ చేశారు.

ప్రజారాజ్యం ఘోర పరాజయంపాలైనా గంటా మాత్రం మళ్ళీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అంతేకాదు ఆ పార్టీ కాంగ్రెస్ లో విలీనమవ్వడంతో మంత్రి కూడా అయ్యారు. ఇక రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం విజయాన్ని ముందుగానే ఊహించిన ఆయన.. 2014 ఎన్నికలకు ముందు మళ్ళీ పసుపు కండువా కప్పుకున్నారు. ఆయన ఊహించినట్లుగానే ఆ ఎన్నికల్లో తెలుగుదేశం గెలిచింది. ఆయన కూడా గెలిచి మంత్రి పదవి చేపట్టారు. 2019 లో ఫ్యాన్ గాలి జోరులోనూ గంటా విజయ ఢంకా మోగించారు. అయితే   తెలుగుదేశం అధికారంలో లేకపోవడంతో ఆయన బీజేపీ వైపు చూస్తున్నారనే వార్తలు ఆమధ్య బలంగా  వినిపించాయి.

గంటా సైతం కొంతకాలం తెలుగుదేశంతో అంటీముట్టనట్టుగా ఉన్నారు. అయితే ఇప్పుడు లెక్క మారింది. 2014 సీన్ మళ్ళీ రిపీట్ అవుతుందని, 2024 ఎన్నికల్లో తెలుగుదేశం గెలుపు ఖాయమని ఆయన ముందుగానే ఊహించినట్టు ఉన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం ఘన విజయం గంటా నమ్మకాన్ని బలపరిచింది. అందుకే ఆయన సైకిల్ మీదే నా ప్రయాణం అంటున్నారు. తాజాగా ఆయన తెలుగుదేశం యువనేత నారా లోకేష్ తో కలిసి యువగళం పాదయాత్రలో పాల్గొన్నారు. దీంతో తెలుగుదేశం శ్రేణులు సంబరపడుతున్నారు. "గంటా ఉన్న దగ్గర గెలుపు ఉంటుంది, గెలుపు ఉన్న దగ్గర గంటా ఉంటాడు" అనే మాట 2024 లో మరోసారి రుజువు అవుతుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక గంటా ముందుగానే ప్రజా నాడి ఏమిటన్నది తెలుసుకున్నారనడానికి లోకేష్  పాదయాత్ర ప్రారంభించడానికి ముందు హైదరాబాద్‌లో ఆయనను ఓ సారి కలిసి పాదయాత్ర విజయవంతం అవుతుందని ప్రకటించారు.

ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో టీడీపీ అభ్యర్థికి మద్దతుగా విస్తృత ప్రచారం చేశారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో మొదట చిన్న లక్ష్మి కుమారి అభ్యర్థిత్వాన్ని పార్టీ ప్రకటించినప్పటికీ అనుకున్నప్పటికీ, గంటా సూచనతోనే చివరి క్షణంలో చిరంజీవి రావును అభ్యర్థిగా పార్టీ అధినేత ప్రకటించారని కూడా చెబుతారు. ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో గంటా విస్తృతంగా ప్రచారం కూడా చేశారు.  ఇప్పుడు గంటా శ్రీనివాస్ పాదయాత్రలో ఉన్న లోకేష్ వద్దకు వెళ్లారు. కలిశారు.