దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా..

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా  లోకేశ్ తనయుడు నారా దేవాన్ష్ పుట్టిన రోజు మార్చి 21వ తేదీ మంగళవారం. ఈ సందర్భంగా ఒక రోజు అన్నప్రసాద  వితరణకు 33 లక్షల రూపాయిల విరాళాన్ని నారా లోకేశ్ దంపతుల తరఫున వారి కుటుంబ సభ్యులు తిరుమలలోని టీటీడీ ఉన్నతాధికారులకు అందజేశారు.  తిరుమలలోని తరగొండ వెంగమాంబ నిత్యన్నప్రసాద కేంద్రంలో జరిగే అన్న ప్రసాద వితరణ కోసం ఈ విరాళాన్ని వినియోగించాలని కోరారు.

అయితే ప్రతి ఏటా దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా ఒక రోజు.. అన్నప్రసాదం కోసం విరాళం ఇవ్వడం నారా ఫ్యామిలీకి  ఆనవాయితీగా వస్తున్న సంగతి తెలిసిందే. నారా దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా  ఈ రోజు నిత్యన్నదానం కోసం విరాళం ఇవ్వడంతో.. మంగళవారం  తిరుమలలోని  శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతాలతోపాటు తరిగొండ వెంగమాంబ నిత్యన్న దానం కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన డిస్ ప్లే బోర్డుల్లో నారా దేవాన్ష్ పేరు ప్రదర్శిస్తున్నారు.  

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌, బ్రహ్మణి దంపతులకు 2015లో దేవాన్ష్ జన్మించారు. దేవాన్ష్ జన్మించిన ఏడాది నుంచి ప్రతి ఏటా అతడి పుట్టిన రోజు నాడు ఇలా తిరుమలలో అన్నదానానికి విరాళం అందజేస్తోందీ నారా కుటుంబం. 

మరోవైపు నారా దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వేదికగా స్పందించింది.  సమాజమే దేవాలయం  అని భావించే సంస్కృతిని, దానగుణాన్ని .. చిన్ననాటి నుంచి పిల్లలకు అలవాటు చేయడం తల్లిదండ్రుల ఉత్తమ సంస్కారానికి నిదర్శనం. టీడీపీ అధినేత, చంద్రబాబు గారి మనవడు నారా దేవాన్ష్ పుట్టిన రోజు.. ఈ రోజు. ఈ సందర్బంగా తిరుమలలో తరిగొండ వెంగమాంబ నిత్యాన్నప్రసాద వితరణ కార్యక్రమంలో కోసం ఒక రోజుకు సరిపడా ఖర్చను.. అంటే 33 లక్షల భారీ విరాళాన్ని అందించారు నారా లోకేశ్, బ్రాహ్మణి దంపతులు, అంతేకాకుండా దేవాన్ష్ పేరుతో టీడీపీ నేతలు, కార్యకర్తలు ఈ రోజు రాష్ట్రమంతటా అన్నదానం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ  ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.