మెదడుకు అమృతం లాంటి ఆహారం ఇది..!

 


ఆహారం శరీరానికి శక్తి వనరు.  ఆహారం సరిపడినంత తీసుకుంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే ఆహారం నుండే శరీరానికి కావలసిన పోషకాలు,  విటమిన్లు, ప్రోటీన్లు, మినరల్స్ అన్నీ లభిస్తాయి. అయితే కొన్ని ఆహారాలకు ప్రత్యేకత ఉంటుంది.  కొన్ని గుండెకు మేలు చేస్తాయి.  కొన్ని కండరాలకు మేలు చేస్తాయి.  కొన్ని కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.  ఇలా మేలు  చేసే ఆహారాలలో మెదడుకు మేలు చేసే ఆహారాలు ముఖ్యమైనవి.  మెదడు పనితీరు బాగుండటం ప్రతి ఒక్కరికి అవసరం.  ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే మెదడు లేదా అని ఆంటుంటారు. అంటే.. మంచి ఆలోచనలకు,  జ్ఞాపకశక్తికి, శరీర కార్యకలాపాలకు మెదడు శక్తివంతంగా ఉండటం అవసరం. అలాంటి మెదడు ఆరోగ్యంగా ఉండాలన్నా, మెదడు పనితీరు బావుండాలన్నా మెదడుకు  శక్తిని ఇచ్చే ఆహారాలు తీసుకోవాలి. మెదడుకు అమృతంతో సమానమైన ఆహారాలు కొన్ని ఉన్నాయి.  అవేంటో తెలుసుకంటే..

వాల్ నట్,  బాదం..

వాల్ నట్, బాదం పప్పులు మెదడు ఆరోగ్యానికి చాలా ప్రయోజనం చేకూరుస్తాయి.  వాల్ నట్ లలోనూ,  బాదం లోనూ అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

మానసికంగా బలహీనంగా ఉన్నా,  జ్ఞాపకశక్తి బలహీనంగా ఉన్నా,  ఆలోచనా పనితీరు, మెదడు చురుగ్గా ఉండాలన్నా వాల్ నట్ లు, బాదం పప్పులు ప్రతిరోజూ తీసుకోవడం మంచిదట. వాల్ నట్ లు బాదం పప్పులలో విటమిన్-ఇ,  ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి.  ఇవి మెదడు కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.

శరీరంలో నరాల పనితీరు బాగుండాలంటే నాడీ వ్యవస్థ బాగుండాలి. నాడీ కణాలు ఆరోగ్యంగా ఉండాలి.  నాడీ కణాలకు పోషణ ఇవ్వడం ద్వారా అల్జీమర్స్ వంటి వ్యాధుల నుండి రక్షించడంలో వాల్ నట్స్, బాదం పప్పులు సహాయపడతాయి.

వాల్ నట్స్,  బాదం పప్పులలో అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫాలీ ఫెనాల్స్ ఉంటాయి. ఇవి వయసుతో పాటు ఆలోచనా సామర్థ్యం తగ్గిపోవడాన్ని నిరోధిస్తాయి. ఫలితంగా మెదడు చురుగ్గా పనిచేస్తుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

వాల్ నట్స్ లో మెలటోనిన్ ఉంటుంది. ఇది మెదడు ఆరోగ్యానికి చాలా  అవసరం.  నిద్రను మెరుగుపరచడం ద్వారా మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. మెదడు కణాలలో ఒత్తిడిని తగ్గిస్తుంది. అంతేకాదు.. వాల్ నట్స్ లో ఉండే నైట్రిక్ ఆక్సైడ్, బాదం పప్పులో ఉండే పొటాషియం మెదడులో రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి.


                                                 *రూపశ్రీ.

Related Segment News