ఎన్ని ప్రయత్నాలు చేసినా నిద్ర రావడం లేదా? ఈ వ్యాధులు ఉన్నాయేమో చెక్ చేసుకోండి..!

 

నిద్ర మనిషి ఆరోగ్యానికి చాలా అవసరం. నిద్రను గొప్ప ఔషదంగా పరిగణిస్తారు.  మంచి నిద్ర ఉంటే  శరీర ఆరోగ్యం చాలా వరకు సాఫీగా ఉంటుంది. కానీ నేటి కాలంలో చాలామంది నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. రాత్రవ్వగానే హాయిగా నిద్రపోవాలని అనుకుని, పడుకుని నిద్ర పట్టక మంచం మీద అటు ఇటు దొర్లుతూ కాలయాపన చేసేవారు.. నిద్రరాక గంటలు గంటలు శూన్యంలోకి చూస్తూ ఆలోచనలలో గడిపేవారు చాలా మంది ఉంటున్నారు. కొందరైతే నిద్ర  బాగా రావాలని పడుకునే ముందు కొన్ని రకాల పానీయాలు కూడా తాగుతుంటారు. అయితే ఇలా నిద్ర రాకపోవడం అనేది సాధారణంగా కొట్టే పడేయాల్సిన విషయం కాదట. ఇలా నిద్ర రాకపోవడం అనేది కొన్ని అనారోగ్య సమస్యలను సూచిస్తుందని అంటున్నారు.  

నిద్రలేమి వివిధ కారణాల వల్ల సంభవించినా.. దీర్ఘకాలం ఈ సమస్య ఎదుర్కొంటూ ఉంటే మాత్రం అది కొన్ని తీవ్రమైన వ్యాధుల వల్ల జరుగుతుంది. నిద్ర లేమి అనేది చాలా వరకు డిప్రెషన్ తో బాధపడేవారికి ఎదురయ్యే సమస్య.  డిప్రెషన్ కారణంగా నిద్ర పట్టడంలో ఇబ్బంది ఏర్పడుతుంది.

చాలామంది ఈ కాలంలో అతి ఆలోచనలు, ప్రతికూల ఆలోచనలు, మానసిక ఒత్తిడి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్యలు కూడా నిద్రను ప్రభావితం చేస్తాయి.  

కొందరిలో స్లీప్ అప్నియా అనే సమస్య ఉంటుంది.  ఇది నిద్రపోతున్నప్పుడు శ్వాస తీసుకోవడంలో అంతరాయం కలిగించే వ్యాధి.  దీని వల్ల శ్వాస సరిగా ఆడక మళ్లీ మళ్లీ నిద్ర మధ్యలో మేల్కొంటు ఉంటారు.

హైపర్ థైరాయిడిజం సమస్య ఉంటే అది జీవక్రియను ప్రభావితం చేస్తుంది.  జీవక్రియ సరిగా లేకపోవడం వల్ల శరీర వ్యవస్థ డిస్టర్బ్ అవుతుంది. ఇది రాత్రి సమయంలో నిద్రలేమి సమస్య కలుగజేస్తుంది.

ఆర్థరైటిస్,  మైగ్రేన్ లేదా ఇతర వ్యాధులు ఉన్న వారు కూడా సరిగా నిద్ర పోలేరు. ఈ వ్యాధుల కారణంగా  నిద్రలో పదే పదే మెలకువ వస్తుంది.  ఈ సమస్యలు ఉన్నవారిలో నిద్ర సమస్యలు కూడా పెరుగుతాయి.

అధికంగా ఆల్కహాల్,  కెఫీన్ పానీయాలు తీసుకునే వారు కూడా నిద్రకు సంబంధించిన సమస్యలతో బాధపడుతుంటారు. ఈ అలవాట్లు ఉన్నవారు రాత్రి సమయంలో సరిగా నిద్రపోలేరు.


                                          *రూపశ్రీ.