తెలంగాణ కాంగ్రెస్‌కి ‘జంపింగ్’ మేనియా!

తెలంగాణ కాంగ్రెస్  పార్టీకి ‘జంపింగ్’ మేనియా పట్టినట్టుంది. బీఆర్ఎస్ నుంచి ఎవర్నయినా సరే కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం ఈ మేనియాకి వున్న ప్రధాన లక్షణం. బీఆర్ఎస్, బీజేపీ కలసి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు చేస్తున్నాయన్న అనుమానాలు ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలను గానీ, ఎమ్మెల్సీలను కానీ కాంగ్రెస్‌లో చేర్చుకోవడంలో ఒక అర్థం, పర్థం ఏడిచాయి. కానీ, బీఆర్ఎస్‌లో వున్న తప్ప, తాలుని కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని మురిసిపోతున్నారు.. అదే ప్రాబ్లం!

బుధవారం నాడు ఢిల్లీలో బీఆర్ఎస్ నాయకుడు కె.కేశవరావుని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. అడుగు తీస్తే అడుగు వేయలేనంత వయసు పెరిగిపోయి వున్న కేశవరావుని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం వల్ల తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి గానీ, తెలంగాణ రాష్ట్రానికి గానీ ప్రత్యేకంగా ఒరిగేదేమీ లేదు. పైగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కేశవరావు చేసినంత ద్రోహం మరే నాయకుడూ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ కేశవరావుకు ఎంతో చేసింది. ఎన్నో హోదాలు ఇచ్చింది. రాజీవ్ గాంధీ టెక్నాలజీ మిషన్ అలాంటి జాతీయ స్థాయి పదవులు ఇచ్చింది. పీసీసీ అధ్యక్షుడిని చేసింది. అయినా తనకు ఇంత చేసిన కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో వున్న సమయంలో కేశవరావు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇప్పుడు బీఆర్ఎస్‌గా మారిన టీఆర్ఎస్ కష్టాల్లో పడగానే మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. ఇలాంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవడం వల్ల ఏం ప్రయోజనం కలుగుతుందో వేలంవెర్రిగా చేర్చుకున్న కాంగ్రెస్ నాయకులకే తెలియాలి.

కె.కేశవరావు ఏమైనా చురుకుగా పనిచేసే యువకుడా? కాదు..! పోనీ ఈయన్ని చూసి ఒక్క ఓటరైనా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారా? లేదు! ఈయన తన అద్భుతమైన తెలివితేటలతో వ్యూహాలు అందిస్తారా? అవకాశం లేదు! అంత తెలివితేటలే వుంటే, కేసీఆర్ ఎప్పడూ ఈ పెద్దమనిషిని తన పక్కనే కూర్చోబెట్టుకునేవారు కదా.. తన తెలివితేటలేవో కేసీఆర్‌కి చెప్పి బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వచ్చేలా చేసేవారు కదా? కాబట్టి.. ఆ యాంగిల్లో కూడా కేశవరావు ఉపయోగపడే వ్యక్తి కాదు. పైగా, కాంగ్రెస్ పార్టీలో కేశవరావు కంటే చురుకైనవాళ్ళు, వ్యూహాలు పన్నగలవారు చాలామంది వున్నారు. ఆ రకంగా చూసినా కేశవరావు వల్ల ప్రయోజనమేమీ లేదు. ఇన్ని మైనస్సులు వున్నవాళ్ళని పార్టీలో చేర్చుకుంటూ పోతే, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మైనస్సులోకి వెళ్ళే ప్రమాదం వుంది! అందుకే, సాధ్యమైనంత త్వరగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తనలో పెరిగిపోతున్న ‘జంపింగ్ మేనియా’కి చికిత్స తీసుకుంటే మంచిది.