అమరావతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రం!

ఆంధ్రుల ప్రజా రాజధాని ‘అమరావతి’ స్థితిగతులను వివరించే శ్వేతపత్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు సమర్పించారు. మీడియా ప్రతినిధుల సమక్షంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఆయన అమరావతి ప్రతి ఒక్క అంశాన్ని వివరిస్తూ మాట్లాడారు. హైదరాబాద్, సికింద్రాబాద్‌ల చెంతనే సైబరాబాద్ నిర్మాణాన్ని చేపట్టినప్పుడు, హైదరాబాద్ అభివృద్ధికి తాను ముందుకు వెళ్ళినప్పుడు ఏర్పడిన సవాళ్ళను వివరిస్తూ ఆయన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఆ రోజున ముందు చూపుతో తాను తీసుకున్న నిర్ణయం హైదరాబాద్‌ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిందని చంద్రబాబు చెప్పారు. 

ఊహించని విధంగా రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ అర్థిక బలం లేకుండా, రాజధాని లేకుండా మిగిలిపోయినప్పుడు గొప్ప రాజధానిని నిర్మించడం ద్వారా ఒక మంచి ముందడుగు వేయాలని తాను భావించానని, చారిత్రక ప్రాధాన్యం వున్న, అన్ని ప్రాంతాలకూ సమదూరంలో వున్న అమరావతిని రాజధానిగా తీర్చిదిద్దడానికి ముందడుగు వేసినప్పుడు అమరావతి ప్రాంత రైతుల నుంచి సానుకూల స్పందన లభించిందని  చంద్రబాబు చెప్పారు. రాజధాని నిర్మాణం పుంజుకుంటున్న దశలో జగన్మోహన్ రెడ్డి అనే దుర్మార్గుడు అధికారంలోకి రావడం, మూడు రాజధానుల డ్రామా ప్రారంభించడంతో అమరావతి నిర్మాణం ఆగిపోయిందని చెప్పారు. దైవానుగ్రహం వల్ల మళ్ళీ అమరావతి తన పూర్వవైభవాన్ని సంపాదించుకునే దిశగా ముందుకు వెళ్తుందని అన్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబు అమరావతికి సంబంధించిన  గణాంకాలను, తన గత ప్రభుత్వం వున్న సమయంలో జరిగిన అభివృద్ధిని, జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత విధ్వంసాన్నిపవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. జగన్ అనుసరించిన దుర్మార్గపు విధానాల వల్ల ప్రపంచం దృష్టిలో రాష్ట్రం నమ్మకాన్ని కోల్పోయిందని, ఎంతోమంది పెట్టుబడి పెట్టినవారు వెనక్కి వెళ్ళిపోయారని చంద్రబాబు వివరించారు. జగన్ వల్ల రాష్ట్రం కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి పాదుకొల్పడానికి కృషి చేస్తానని ఆయన చెప్పారు. అమరావతి గురించి, ఇతర అన్ని అంశాల గురించి తమ మిత్రపక్షమైన ఎన్డీయే ప్రభుత్వానికి వివరించి సహకారం కోసం ప్రయత్నిస్తానని  చంద్రబాబు చెప్పారు. అమరావతి నిర్మాణ పనులను ఎలా ముందుకు తీసుకెళ్ళాలి.. మరోసారి అమరావతికి ఎవరైనా అన్యాయం తలపెట్టకుండా ఏమి చేయాలి.. భూములను స్వచ్ఛందంగా ఇచ్చిన రైతులకు ఎలా న్యాయం చేయాలి.. ఇలాంటి ఎన్నో అంశాలు వున్నాయని, వాటన్నిటి గురించి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు వివరించారు.