సామాన్యుడి నెత్తిన గ్యాస్ ధరల బండ!

కొంచం విరామం అంతే మళ్లీ చమురు సంస్థలు తమ బాదుడు మొదలెట్టేశాయి. తాజాగా గృహావసరాలను వినియోగించే గ్యాస్ సిలెండర్ ధరపై ఏకంగా 50 రూపాయలు వడ్డించాయి. ఈ వడ్డింపు బుధవారం నుంచే అమలులోకి వస్తుంది. ఇటీవలే అంటే ఈ నెల 1వ తేదీన వాణిజ్యావసరాలకు వినియోగించే ఎల్పీజీ గ్యాస్ సిలెండర్ ధరను 183.50 రూపాయలు తగ్గించిన చమురు సంస్థలు గృహావసరాలకు వినియోగించే బండపై 7వ తేదీ నుంచి 50 రూపాయలు వడ్డించడం విశేషం. ఇప్పటికే వెయ్యి రూపాయలు దాటేసిన గ్యాస్ సిలెండర్ ధర ఈ పెంపుతో 1100 రూపాయలకు చేరుకుంది.

హైదరాబాద్ లో 14.2 కేజీల ఎల్పీజీ గ్యాస్ సిలెండర్ ధర 1105 రూపాయలకు చేరుకుంది. కేంద్రంలో మోడీ సర్కార్ ధరల పెంపు విషయంలో తగ్గేదే లే అన్న తీరుతో వ్యవహరిస్తున్నది. ఏదైనా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఉంటే.. ఆ సమయంలో మాత్రం ధరల పెంపును ఆపి ఎన్నికలు పూర్తయిన తరువాత అదీ ఇదీ కలిపి వడ్డించడం కేంద్రానికి ఒక అలవాటుగా మారిపోయింది.

నిత్యావసర వస్తువుల ధరలన్నీ అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోతున్నా వాటి నియంత్రణ విషయంలో మాత్రం ప్రభుత్వం నిష్క్రియాపరత్వం ప్రదర్శిస్తూ, ధరల పెంపు విషయానికి వచ్చే సరికి ఎక్కడ లేని తొందరపాటు, ఉత్సాహం ప్రదర్శిస్తున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.