వాలంటీర్లకు వైసీపీ ఎసరు!

ప్రజలలో వ్యతిరేకత వైసీపీపై కాదు.. వైసీపీ ఎమ్మెల్యేలపై కాదు వ్యతిరేకత అంతా వాలంటీర్లపైనే.. ఇదీ వైసీపీ నేతలు ఇప్పుడు ముక్తకంఠంతో చెబుతున్న మాట. మనం నియమించిన వాళ్లు వాలంటీర్లు ఇప్పుడు వారి వల్లే మనకు ఇబ్బంది ఎదురౌతోందనుకుంటే వాళ్లని తొలగించేద్దాం అదెంత సేపు అన్నదే ఇప్పుడు వైసీపీ నేతలు చెబుతున్న మాట. పార్టీ ప్లీనరీలకు ముందు నిర్వహించిన జిల్లాల ప్లీనరీలలో నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ ఇదే విషయం చెప్పారు.

పార్టీ బలోపేతం, పార్టీ అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఇలా వేటి గురించీ జిల్లా ప్లీనరీలలో చర్చించలేదు. అందరూ వాలంటీర్లను ఆడిపోసుకోవడానికే పరిమితమయ్యారు. తానేటి వనిత, దాడిశెట్టి రాజా, అంబటి రాంబాబు ఇలా మంత్రులందరిదీ దాదాపు ఒకటే మాట.. వాలంటీర్ల వల్ల మనం ప్రజలలో చులకన అవుతున్నాం. వారిని తొలగించేద్దాం అనే. ఎమ్మెల్యేలు, నాయకులూ కూడా వారికి వంత పాడారు. అదే సమయంలో వాలంటీర్లు అందరూ వైసీపీవారే అని కూడా అంటున్నారు. ఇదేం తిరకాసో అర్ధం కాక రాజకీయ పండితులు సైతం తలలు పట్టుకుంటున్నారు. ఇంతకీ అసలు విషయమేమిటంటే...పథకాల లబ్ధిదారుల ఎంపిక నుంచి ప్రతి విషయాన్నీ వాలంటీర్లకు అప్పగించిన జగన్ నియోజకవర్గాలలో, గ్రామాలలో, వార్డులలో వారిదే పెత్తనంగా మార్చేశారు. దీంతో ఎమ్మెల్యేలు, ఆఖరికి మంత్రులు కూడా వారి వారి ఇలాకాలలో డమ్మీలుగా మారిపోయారు.

ప్రజలకు దూరమయ్యారు. ఏ పనీ చేయలేక నిస్సహాయులుగా మిగిలిపోయారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వారిలో ఆందోళన, అలజడి ఆరంభమైంది. తమ వారి వద్ద తమ  పలుకుబడి చూపించుకోవాలంటే నెపం వాలంటీర్లపై నెట్టేయడమే మార్గమని భావిస్తున్నారు. వాలంటీర్లు వారికి ఇచ్చిన అవకాశాలను దుర్వినియోగం చేసుకుని వ్యవస్థలో జొరబడి అస్తవ్యస్తం చేసేశారని నిందిస్తున్నారు. వారిని తొలగించేద్దామనీ, ఆ తరువాత మనదే రాజ్యమని కింది స్థాయి క్యాడర్ కు నచ్చ చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

ప్రజలకు ప్రజాప్రతినిధులకు వారధిగా ఉంటారన్న ఉద్దేశంతో జగన్ ఏర్పాటు చేసిన వాలంటీర్ల వ్యవస్థ ప్రజా ప్రతినిథులను డమ్మీలను చేసేలా మారిపోయిందన్న అసంతృప్తి వైసీపీ ఎమ్మెల్యేలలో చాల కాలంగా ఉంది. ఇంత కాలం లోపల్లోపల దాచుకున్న ఈ అసంతృప్తినీ, ఆగ్రహాన్నీ జిల్లా ప్లీనరీలలో ఒక్క సారిగా వెల్లగక్కేశారు. అసలే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తరువాత పార్టీలో అసంతృప్తులతోనే సమస్యలు ఎదుర్కొంటున్న పార్టీ అగ్ర నేతలకు ఇప్పుడు వాలంటీర్లపై ప్రజా ప్రతినిథుల ఆగ్రహం కొత్త తలనొప్పులను తీసుకువస్తోంది. వెరసి ఇది వాలంటీర్ల ఉద్యోగాలకు ఎసరు తీసుకువచ్చే వరకూ వెళ్లింది. ఇప్పటికే రెగ్యులరైజేషన్ విషయంలో అసంతృప్తితో ఉన్న వాలంటీర్లు ఇప్పుడు తొలగింపు అంటూ పార్టీ కొత్త పల్లవి ఎత్తుకోవడంతో రగిలిపోతున్నారు.

మొత్తం మీద ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి కుటుంబం వైసీపీ వైపే ఉండేందుకు జగన్ వ్యూహాత్మకంగా ఏర్పాటు చేసిన వాలంటీర్ల వ్యవస్థ ఇప్పుడు మొదటికే మోసం అన్నట్లుగా తయారైంది. ఇటు పార్టీ క్యాడర్ లోనూ.. అటు ప్రజలలోనూ వాలంటీర్లపై ఆగ్రహం పెల్లుబుకుతుండటం.. ఆ వ్యవస్థ వల్లే పార్టీ కేడర్ కు ప్రజలకు మధ్య సంబంధాలు తెగిపోవడం.. ఇప్పుడు వారిని తొలగిస్తే మిగిలిన స్వల్ప వ్యవధిలో మళ్లీ నియోజకవర్గాల వారీగా, వార్డుల వారీగా, గ్రామాల వారీగా పథకాల లబ్ధిదారుల వద్దకు నేరుగా ప్రజా ప్రతినిథులను పంపి పథకాల ప్రచారంతో ఊదరగొట్టే సమయం లేకపోవడంతో వైసీపీలో ఆందోళన పెరుగుతోంది. ఏం చేయాలో తెలియక సభల్లో, సమావేశాల్లో వాలంటీర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వారిని తొలగించేద్దామంటూ కేడర్ కు చెబుతూ పరిస్థితి మరింత దిగజారకుండా జాగ్రత్త పడుతున్నారు.