భాగ్యనగరంలో నెల రోజులు 144 సెక్షన్

హైదరాబాద్ లో పోలీసులు ఆంక్షలు విధించారు. నెల రోజుల వరకూ నగరంలో 144వ సెక్షన్  కింద ఆంక్షలు అమలులో ఉంటాయని సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. ఈ ఆంక్షల మేరకు నగరంలో ఎలాంటి సమావేశాలు, ర్యాలీలకు అనుమతి ఉండదు. అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని సీవీ ఆనంద్ హెచ్చరించారు.  ఈ ఆంక్షలు ఆదివారం (అక్టోబర్ 27) నుంచి అమలులోకి వచ్చాయి. వచ్చే నెల 28 వరకూ అమలులో ఉంటాయి. ఈ మేరకు సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వ్యులు జారీ చేశారు. 144 సెక్షన్ ప్రకారం ఒకే చోట ఐదుగురు అంతకు మించి జనం గుమికూడకూడదు.  

అయితే ఇందిరా పార్క్ ధర్నా చౌక్  వద్ద శాంతి యుతంగా నిరసనలు, ధర్నాలకు ఎటువంటి ఆంక్షలూ లేవని పేర్కొన్నారు. ధర్నా చౌక్ వద్ద ధర్నాలు, నిరసనలు శాంతియుతంగా నిర్వహించుకునేందుకు అనుమతి ఉంటుందని ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు. ధర్నా చౌక్ వినా నగరంలో మరెక్కడా ధర్నాలు, ప్రదర్శనలు, నిరసనలు, సభలు, సమావేశాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.