హద్దు, అదుపు లేని వర్మ వాగుడు

 

దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ మెదడు ఈమధ్య కాలంలో మోకాలిలోకి జారిపోయిందన్న అభిప్రాయం ప్రజల్లో కలిగింది. అయితే ఆ అభిప్రాయం పూర్తిగా తప్పు. ఎందుకంటే రామ్‌గోపాల్ వర్మ మెదడు మోకాల్లోకి కాదు.. అరికాల్లోకి జారిపోయింది. ఈ విషయంలో ఎవరికైనా డౌట్ వుంటే, వర్మ తాజాగా ట్విట్లర్లో చేసిన కామెంట్లు చూసి కన్ఫమ్ చేసుకోవచ్చు. రామ్ గోపాల్ వర్మ దేవుళ్ళకి కూడా ప్రాంతీయ భేదం అంటగట్టే ప్రయత్నం చేశారు. తనకు దేవుడి మీద నమ్మకం లేదని అంటూనే, తెలంగాణ ప్రజలు తమ సొంత దేవుడైన యాదగిరి నరసింహుడి కంటే ఆంధ్రాలోని దేవుడైన తిరుపతి వేంకటేశ్వరుడిని పూజించడం సరైనదేనా అని రాంగోపాల్ వర్మ ట్విట్టర్లో ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర  ప్రజలు తిరుపతి వేంకటేశ్వరుడిని పూజించడం యాదగిరి నరసింహుడికి అవమానమేనని తాను భావిస్తానని రాంగోపాల్ వర్మ కామెంట్ చేశారు. మనం సొంత దేశాన్ని ప్రేమించినట్టుగా సొంత దేవుళ్ళని పూజించాలేగానీ పొరుగు రాష్ట్రాల దేవుళ్ళని కాదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు యాదగిరి నరసింహుడి కంటే వేంకటేశ్వరస్వామిని ఎక్కువగా తలచుకుంటారని అనడం తప్పుకాదు కదా అని బోలెడంత తెలివిగా ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంతకాలానికి యాదగిరిగుట్టను అభివృద్ధి చేస్తాననడం తనకు చాలా  సంతోషాన్ని కలిగిస్తోందని, దీంతో తెలంగాణ ప్రజలు తమ సొంత దేవుడి విలువను తెలుసుకుంటారని కామెంట్ చేశారు.