కేసీఆర్ లాయర్ అవతారం
posted on Nov 19, 2014 4:23PM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్ళి తానే వాదిస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో నీరు, ప్రాజెక్టుల అంశం మీద జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. నీటి కేటాయింపుల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని, ఈ విషయంలో ట్రైబ్యునల్‌లో న్యాయం జరగకపోతే సుప్రీం కోర్టుకు వెళ్ళి అవసరమైతే తానే వాదిస్తానని అన్నారు. సీమాంధ్ర పాలకులు తెలంగాణ ప్రాజెక్టులను తొక్కిపెట్టారని ఆయన ఆరోపించారు. ప్రాజెక్టుల విషయంలో తమ ప్రభుత్వానికి చిత్తశుద్ధి వుందని చెప్పారు. తెలంగాణ ఉద్యమ నినాదమే నీళ్ళు, నిధులు, నియామకాలు అని కేసీఆర్ అన్నారు. ఎస్సెల్ బీసీ టన్నెల్ ఇంజనీర్లను తాను పిలిచి మాట్లాడానని తెలిపారు. పనులు ముందుకు సాగాలని మాట్లాడానన్నారు. ఇచ్చంపల్లి ప్రాజెక్టును కట్టి తీరాల్సిందేనని కేసీఆర్ స్పష్టం చేశారు. కృష్ణా నీటిలో తెలంగాణకు న్యాయం జరిగి తీరాలని చెప్పారు. కృష్ణా, గోదావరి నదుల వాటాలో మన భాగం మనం సాధించుకోకపోతే భవిష్యత్ తరాలకు నష్టం జరిగే ప్రమాదం వుందని కేసీఆర్ వివరించారు.