తెలంగాణా ఏర్పాటుపై దిగ్విజయ్ సానుకూల సంకేతాలు

 

రేపు రాష్ట్ర విభజనపై ఖచ్చితంగా తుది నిర్ణయం ప్రకటిస్తామని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ దిగ్విజయ్‌సింగ్ స్ఫష్టం చేశారు. ఈ విషయమై ఇప్పటికే అన్ని వర్గాలతో చర్చలు ముగిసినందున ఇక రేపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో రాష్ట్ర విభజనపై తుది నిర్ణయం ప్రకటిస్తామని ఆయన తెలిపారు. దిగ్విజయ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు శాసనసభలో తీర్మానం తప్పని సరి కాదని, అది కేవలం ఒక రాజ్యంగ విధానం మాత్రమేనని చెప్పడం గమనిస్తే రాష్ట్ర విభజన ఖాయమయినట్లు తెలుస్తోంది. డిల్లీ నుండి వస్తున్న తాజా సమాచారం ప్రకారం తెలంగాణా ప్రజలు కోరుకొంటున్న విధంగానే 10 జిల్లాలతో కూడిన తెలంగాణా ప్రకటించవచ్చునని తెలుస్తోంది. అయితే, హైదరాబాద్ ను రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా చేసి కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజన సజావుగా పూర్తయ్యి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని ఏర్పాటు చేసుకొనే వరకు, అంటే కనీసం 4 లేదా5 సం.ల వరకు హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా ఉంచే అవకాశం ఉంది. తెలంగాణా గవర్నర్ కే హైదరాబాద్ బాధ్యతలు కూడా అప్పగించే అవకాశం ఉంది.