జగన్ లో ఎన్నికల భయం

నిండా మునిగిన వాడికి చలేమిటంటారు. అయితే ఈ నానుడి ఏపీలో అధికారంలో ఉన్న జగన్ రెడ్డి ప్రభుత్వానికి వర్తిస్తున్నట్లు లేదు. అన్ని వైపుల నుంచీ వ్యతిరేకత వెల్లువెత్తుతుంటే.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డిలో ఎన్నికల భయం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. బుధవారం (జూన్ 7) జరిగిన కేబినెట్ భేటీలో ఆయన మాటల్లో ఈ విషయం  తేటతెల్లమైంది.

గడపగడపకూ వైఫల్యంపై మంత్రులపై ఆగ్రహం లేదు. టికెట్ ఇవ్వబోనన్న హెచ్చరికల్లేవు. పని తీరుపై సమీక్షలు లేవు. ఇవేమీ లేకపోగా బాబ్బాబు ఓ తొమ్మిది నెలలు కష్టపడి పని చేయడం చాలు మళ్లీ అధికారంలోకి వచ్చేస్తామన్న వినతులు, విజ్ణప్తులే కనిపించాయి. ఇక కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు చూస్తుంటే 2019 ఎన్నికలకు ముందు చెప్పిన అబద్ధాలనే కొత్తగా 2024 ఎన్నికల ముందు మరోసారి వల్లెవేయడం వినా మరో కొత్త వ్యూహాలు కానీ, కార్యాచరణ ప్రణాళికలు కానీ ఉన్నట్లు కనిపించలేదు. ప్రభుత్వ వ్యవహారాలు, రాష్ట్ర ప్రగతిపై దృష్టి సారించే సమయమే కరవైన జగన్ కు  ముందస్తు ఎన్నికలకు వెళ్లడం వినా మరో గత్యంతరం లేదన్న విశ్లేషణలు ఇటీవలి కాలంలో వెల్లువెత్తాయి. అసలు బుధవారం (జూన్ 7) నాటి కేబినెట్ భేటీ ముందస్తు ప్రకటన కోసమేనని కూడా ఊహాగానాలు వెల్లువెత్తాయి. రాజకీయ పరిశీలకులు కూడా ముందస్తే జగన్ కు మిగిలిన ఏకైక ప్రత్యామ్నాయం అన్న రీతిలో విశ్లేషణలు చేశారు.

అసలు ముందస్తు ముచ్చట తీసుకు వచ్చింది కూడా స్వయంగా జగనేనని తెలిసిందే. అలాగే ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఎప్పటికప్పుడు ముందస్తు ముచ్చటను సజీవంగా ఉంచడంలో తన వంతు ప్రయత్నం చేశారు. స్వయంగా ఆయన నోటితోనే జగన్ ముందస్తు యోచనలో ఉన్నారని కూడా చెప్పారు. సరే వీటన్నిటినీ పక్కన పెడితే ఇటీవల హస్తిన పర్యటనకు వెళ్లిన జగన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో అర్ధరాత్రి భేటీ తరువాత.. అక్కడి నుంచే కేబినెట్ భేటీకి ముహూర్తం ఖరారు చేయడంతో ఇక ముందస్తే అని అంతా భావించారు. అయితే వారం రోజుల వ్యవధిలో అంచనాలన్నీ తల్లకిందులయ్యాయి.  

ముందస్తుకు వెడితే ముందే మునిగిపోవడం ఖాయమన్న ఇంటెలిజెన్స్ నివేదికలతో జగన్ తన నిర్ణయం మార్చుకున్నారని అంటున్నారు. ముందస్తైనా కాకున్న మునక ఖాయమని తేలిపోయిన తరువాత ముందుగా అధికారం కోల్పోవడమెందుకన్న భావనతోనే ఆయన షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు అంటూ కొత్త పల్లవి అందుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అసలు గడపగడపకూ ఉద్దేశమే చేసిన పనులు చెప్పుకుని విపక్షానికి ఎన్నికల ప్రిపరేషన్ కు సమయం లేకుండా చేసి ముందస్తుకు వెళ్లడమే. అయితే గడపగడపకులో వెల్లువెత్తిన నిరసన సెగలు, పార్టీలో రోజురోజుకూ తీవ్రమౌతున్న అసంతృప్తి చూసిన తరువాత ఇక ఏ మాత్రం ఆలస్యం చేసినా మొదటికే మోసం తప్పదన్న భావన పార్టీ శ్రేణుల్లోనే ఏర్పడింది. అందుకు తగ్గట్టుగానే జగన్  కూడా ముందస్తు సంకేతాలు ఇస్తూనే వచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటుగానే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా కానిచ్చేయాలని ప్రణాళికలు కూడా రచించారు.

ఇందుకు హై కమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చినట్లు చెబుతున్నారు. ముందస్తుకు వెళ్లకుంటే రాష్ట్రంలో జగన్ సర్కార్ పై వెల్లువెత్తుతున్న వ్యతిరేకతకు..   మోడీ ప్రభుత్వ వ్యతిరేకత కూడా కలిసి మొత్తానికే మోసం వస్తుందన్న భావన వైసీపీ శ్రేణుల్లో బలంగా వ్యక్తమైంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ శ్రేణులు కూడా ముందస్తు తథ్యమనే నిర్ణయానికి వచ్చేశారు. అయితే అనూహ్యంగా ముందస్తు విషయంలో జగన్ వెనకడుగు వేశారు. ఇందుకు ఓటమి భయమే కారణమని విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. 
రాజమహేంద్రవరం మహానాడులో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు వ్యూహాత్మకంగా మినీ మేనిఫెస్టో ప్రకటించడంతో.. జగన్ వచ్చే ఎన్నికలను ఎలా ఎదుర్కోవడం అన్న విషయంలో మైండ్ బ్లాంక్ అయిపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత నాలుగేళ్లలో రాష్ట్రంలో అభివృద్ధి జాడ లేకపోవడంతో  జనం కూడా ఫిక్సైపోయారనీ, ఓటమి తప్పించుకోవాలంటే.. మిగిలిన తొమ్మిది నెలల కాలంలో  జగన్ సర్కార్ అద్భుతాలు చేయాల్సి ఉంటుందని జగన్ నియమించుకున్న ఐప్యాక్ సర్వేలే తేటతెల్లం చేయడంతో జగన్ ముందస్తు విషయంలో వెనక్కు తగ్గారని అంటున్నారు. ముందస్తుగా అధికారం కోల్పోవడమెందుకు చివరి వరకూ అధికారంలో ఉండి ఈ తొమ్మది నెలల కాలంలో మళ్లీ ఉచితాలు, వాగ్దానాలతో ప్రజలను మరోసారి మాయ చేయాలని జగన్ భావిస్తున్నారు. ఎవరేమన్నా ఏమనుకున్న పార్లమెంటు ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎన్నికలకు వెళితే.. అటు మోడీ ప్రభుత్వ యాంటీ ఇంకంబెన్సీ కూడా తోడై జగన్ పార్టీ తీవ్రంగా నష్టపోవడం ఖాయమన్న అంచనాల నేపథ్యంలో  జగన్ ముందస్తు యోచన చేసినా ముందస్తైనా వెనకస్తైనా ఫలితం ఒకటే కదా.. అన్న భావనతో జగన్ వెనకడుగు వేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.