కేసీఆర్ కు బాబు భయం?

తెలంగాణలో పూర్వ వైభవం సంతరించుకొనేందుకు తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. ఆ క్రమంలో హైదరాబాద్‌లోనే కాకుండా.. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్నసభలకు జనం పోటెత్తుతున్నారు. దీంతో వచ్చే ఎన్నికల వేళ.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతోపాటు టీడీపీ నుంచి కూడా గట్టి పోటీ తప్పదనే విషయం బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు స్పష్టంగా అర్ధమైంది.   ఆ క్రమంలో ఆయన ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ జోరు పెంచేందుకు జంకుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బీఆర్ఎస్ వర్గాల్లో కూడా దాదాపుగా ఇదే రకమైన చర్చ సాగుతోంది.  

ఓ వేళ కేసీఆర్.. ఆంధ్ర రాజకీయాల్లో వేలు పెడితే.. తెలుగుదేశం అధినేత  చంద్రబాబు తెలంగాణలో  తన ప్రతాపాన్ని ప్రదర్శించడమే కాకుండా..  అటు కాంగ్రెస్ కు లేదా     ఇటు బీజేపీకి కానీ మద్దతు ఇస్తే.. భారీగా ఓట్లు చీలిపోయే ప్రమాదం  ఉందని.. ఇఅదే జరిగితే కారు టైర్ పంక్చర్ అవ్వడం ఖాయమనీ పరిశీలకులు అంటున్నారు. దీంతో  సైలెంట్‌గా ఉండి.. తెలంగాణలో మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకొంటే.. ఆ తర్వాత  సంగతి తరువాత చూసుకోవచ్చుననే  ఆలోచనలో బీఆర్ఎస్ అధినేత ఉన్నారన్న చర్చ రాజకీయవర్గాల్లో  హల్‌చల్ చేస్తున్నది.  ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు నగరంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభమైనా,  ఆ కార్యక్రమానికి ఆ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరుకాకపోవడానికి కూడా కారణం అదేనని పరిశీలకులు అంటున్నారు. అలాగే విశాఖపట్నం వేదికగా బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహించాలని ప్రణాళికలు సైతం సిద్ధం చేసినా ఇప్పుడా ఊసే ఎత్తడం లేదని చెబుతున్నారు.

అయితే ఏపీలో కేసీఆర్ అడుగు పెట్టకపోవడం వెనుక పెద్ద తతంగమే ఉందన్న చర్చ బీఆర్ఎస్ వర్గాల్లో మొదలైంది.  ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సీఎం కేసీఆర్ సొంతంగా... పలు సర్వేలు  చేయించుకొన్నారని.. ఆ వివరాల ప్రకారం.. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో కేసీఆర్ పార్టీ పోటీ చేస్తే.. వచ్చే అనుకూల ఫలితాల కంటే.. తెలంగాణలో ప్రస్తుతం చేతిలో ఉన్న అధికారం కూడా చేజారే అవకాశాలు మెండుగా ఉన్నాయని... అదే విధంగా తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమ నేతగా, టీఆర్ఎస్ పార్టీ అధినేతగా కేసీఆర్... ఆంధ్రులను లక్ష్యంగా చేసుకొని చేసిన వ్యాఖ్యలు ఇంకా వారి మనస్సు పొరల్లో భద్రంగా ఉన్నాయని.. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో  బీఆర్ఎస్ పార్టీ పట్ల.. ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని సదరు నివేదికలు క్లియర్‌కట్‌గా స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. 


మరోవైపు రాష్ట్ర విభజనతో రాజధాని హైదరాబాద్‌ని ఆంధ్రులు కోల్పోయారని.. ఆ సమయంలో అంటే 2014లో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. రాజధానిగా అమరావతిని ఎంపిక చేసి.. ఆ దిశగా ఆయన అడుగులు వేశారని.. అంతలో 2019 ఎన్నికలు రానే వచ్చాయని.. ఈ ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ అధినేత వైయస్ జగన్... ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం.. ఆ తర్వాత.. ఆయన ఏపీకి మూడు రాజధానులంటూ ప్రకటించడంతో.. రాజధాని అమరావతిని సైతం కోల్పోయిన పరిస్థితికి దాదాపుగా వచ్చేశామని.. దీంతో రాష్ట్ర విభజనకే కాదు.

గత ఎన్నికల్లో వైయస్ జగన్‌ గెలుపునకు పూర్తి సహాయ సహకారాలు అందించడంలో తెలంగాణ సీఎం కేసీఆర్ తన వంతు పాత్ర పోషించారని... ఈ నేపథ్యంలో గులాబీ బాస్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత సైతం వ్యక్తమవుతోందనే చర్చ సైతం సదరు సర్వే నివేదికల్లో స్పష్టమైనట్లు తెలుస్తోంది. అటువంటి వేళ గులాబీ బాస్ కేసీఆర్.. తెలంగాణ ఎన్నికల్లో గెలుపు కోసం కృషి చేసి.. ఆ తర్వాత ఎప్పటిలాగా లోక్‌సభ ఎన్నికలపై దృషి సారించే అవకాశాలు ఉన్నాయని కారు పార్టీలో ఓ ముచ్చట అయితే ముచ్చటగా సాగుతోంది.