విజయ్‌ కొత్త అవతారం.. పార్టీ జెండాను ఆవిష్కరించిన దళపతి!

సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వెళ్ళి విజయం సాధించిన వారు తమిళనాడులోనే ఎక్కువ మంది ఉన్నారని చెప్పొచ్చు. ఎం.జి.ఆర్‌., జయలలిత, కరుణానిధి.. ఇలా అందరూ సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్నవారే. వారి తర్వాత కూడా ఎంతో మంది నటీనటులు రాజకీయ నేతలుగా ఎదిగారు. చాలా కాలంగా దళపతి విజయ్‌ రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం జరిగింది. అందరూ అనుకున్నట్టుగానే తమిళగ వెట్రి కళగం పేరుతో ఓ రాజకీయ పార్టీని స్థాపించారు విజయ్‌. రాజకీయాల్లో పూర్తి స్థాయిలో కార్యకలాపాలు జరిపేందుకు సినిమాలను సైతం వదులుకునేందుకు విజయ్‌ సిద్ధపడ్డాడు. ప్రస్తుతం చేస్తున్న సినిమాలను పూర్తి చేసి సినిమాలకు గుడ్‌బై చెప్పబోతున్నాడు. 

తాజాగా వెట్రికళగం పార్టీ జెండాను చెన్నయ్‌ పనయూర్‌లోని పార్టీ ఆఫీస్‌లో  ఆవిష్కరించారు విజయ్‌. ఈ జెండా ఎంతో కలర్‌ఫుల్‌గా ఉంది. పైన, కింద ఎరుపు మధ్యలో పసుపు రంగుతో ఉన్న ఈ జెండాలో మధ్యలో వాగాయ్‌ అనే పువ్వు, దానికి ఇరువైపులా ఏనుగులు కనిపిస్తున్నాయి. పూర్వకాలం యుద్ధాన్ని గెలిచి వచ్చిన యోధులకు వాగాయ్‌ పూలతో కూడిన దండలను వేసి స్వాగతం పలకడం సాంప్రదాయంగా ఉండేది. అందుకే ఈ పూలను విజయానికి సూచనగా వాడతారు. అంతేకాదు, ఈ జెండాపై ప్రముఖ తమిళ కవి తిరువళ్ళువర్‌ రాసిన ‘పిరపోక్కుమ్‌ ఎల్ల ఉయుర్కుమ్‌’ అనే కొటేషన్‌ కూడా ఉంది. దాని అర్థం ‘పుట్టుకతో అందరూ సమానమే’. ఈ ఒక్క కొటేషన్‌తో తన పార్టీ సిద్ధాంతం ఏమిటి, ఏ నినాదంతో ముందుకు వెళ్తున్నారు అనేది రివీల్‌ చేశారు విజయ్‌. జెండా ఆవిష్కరణ జరిగిన తర్వాత పార్టీ గీతాన్ని కూడా విడుదల చేశారు. ఈ సందర్భంగా విజయ్‌ మాట్లాడుతూ ‘ఇవాళ పార్టీ జెండాని ఆవిష్కరించడం ఎంతో గర్వంగా ఉంది. తమిళనాడు అభివృద్ధి కోసం కలిసికట్టుగా పని చేద్దాం. సామాజిక న్యాయమే నా లక్ష్యం. ఇదే బాటలో అంతా నడుద్దాం’ అంటూ పిలుపునిచ్చారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా తమ పార్టీ పోటీ చేస్తుందని చెప్పారు విజయ్‌.