మనిషి ఆలోచనను తట్టి లేపే దాదాజీ కొండదేవ్ అనుభవం!

భారతదేశంలో ఛత్రపతి శివాజీ పరిపాలిస్తున్న కాలంలో  ఒక సంఘటన జరిగింది. శివాజీకి శస్త్ర విద్య గురువు, సమర్థుడైన సలహాదారు, శ్రేయోభిలాషి అయిన దాదాజీ కొండదేవ్ కు సంబంధించిన ఈ సంఘటన ఆయన ఎంత గొప్ప వారో, మనిషి ఆత్మసాక్షి ఎలా ఉండాలో తెలియజేస్తుంది. ఈ కారణంగానే. శివాజీ ఆయనను ఎంతో గౌరవించేవాడు.

ఒక రోజు దాదాజీ కొండదేవ్ ఉద్యానం పక్క నుంచి వెళుతుండగా కాయలతో నిండి ఉన్న మామిడిచెట్టు కనిపించింది. ఆయన దృష్టి ఆ చెట్టు మీద పడింది. కొన్ని కాయలు కోసుకుంటే బాగుండుననే ఆలోచన వచ్చింది. అలాగే మామిడికాయలు కొన్ని కోసుకుని, చేత పట్టుకుని ఇంటికి వెళ్ళాడు. కాయలు భార్య చేతికిచ్చాడు. మామిడికాయలు తీసుకుంటూ "ఇవి ఎవరిచ్చారు?" అని భార్య అడిగింది.

"రాజోద్యానంలో నుండి కోసుకుని వచ్చాను” అని ఆయన చెప్పాడు. వెంటనే భార్య, "అనుమతి తీసుకున్నారా?" అని అడిగింది. అప్పటిదాకా చాలా సాధారణంగా ఉన్న దాదాజీ కొండదేవ్ ఆలోచనలో పడ్డాడు , ఆ వెంటనే కొద్దిగా కంగారుపడి, “లేదు” అని చెప్పాడు. "అయితే ఇది దొంగతనం చేసినట్టు కాదా?" అని భార్య అంది. దాదా కొండదేవ్ కు తన పొరపాటు తెలిసివచ్చింది. ",నిజమే నేను ఎవరినీ అడగకుండా, నాకు అందుబాటులో ఉన్నాయని తోటలో కాయలు కోసుకొచ్చాను ఇది తప్పే" అనుకున్నాడు. ఏమి చెయ్యాలో అర్థం కాక  భార్యనే సలహా అడిగాడు.

“దొంగతనానికి ఉపయోగించే చేతిని ఖండించి వేసుకోవడమే మార్గం. అప్పుడు ఇలాంటి పొరపాటు మరోసారి జరగదు" అని ఆమె సలహా ఇచ్చింది. ఇది విన్నవెంటనే దాదాజీ కొండదేవ్ తన ఒర నుండి కత్తిని లాగాడు. తన చేతిని ఖండించుకోబోయాడు. అంతలో భార్య తన భర్త చేతిని పట్టుకుని "ఈ రోజు నుండి ఈ చేతులు మీవి కాదు. ఇవి దేశానికి సంబంధించినవి. వీటిని దేశశ్రేయస్సు కోసమే ఉపయోగించాలి" అని చెప్పింది. 

“కానీ ఈ చేతులు నేరం చేసినట్లు అందరికి తెలియాలి కదా! ఎలా?" అని దాదాజీ కొండదేవ్ అడిగాడు. "అందుకు మీ చొక్కా చేతులను ఖండించవచ్చు. అలా ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు" అని ఆమె చెప్పింది. దాదాజీ కొండదేవ్ అలాగే చేశాడు.

మరునాడు ఆయన చేతులు లేని చొక్కా ధరించి దర్బారుకు వెళ్ళాడు. అది చూసి అందరూ పరిహాసం చేశారు. అసలు కారణం తెలుసుకొన్న తరువాత సభికులంతా ఎంతో ప్రభావితమయ్యారు. అప్పటి నుండీ దాదాజీ కొండదేవ్ తన జీవితంలో ఎన్నడూ చేతులున్న చొక్కాలను ధరించలేదు.

సమాజానికి చెందిన సంపదను దాని విలువ చెల్లించకుండా సొంత పనుల కోసం వాడుకోకూడదు. అలా వినియోగించుకుంటే అది దేశం పట్ల, సమాజం పట్ల క్షమించరాని నేరం అవుతుంది. దాదాజీ కొండదేవ్ అనుభవం ఇదే విషయాన్ని తెలియజేస్తుంది. అలాగే మనిషికి చేసిన పని పట్ల ఆత్మసాక్షి అనేది ఉంటుంది. దాన్ని అందరూ గుర్తెరగాలి.

                                        *నిశ్శబ్ద.

Related Segment News