భార్యాభర్తల బంధాన్ని బిందాస్ గా మార్చే బ్యూటిఫుల్ డే..
posted on Aug 18, 2023 3:03PM
ప్రేమ మన తెలుగు సినిమాల్లో, కథల్లో ఎంతో అందంగా చిత్రించబడుతూ ఉంటుంది. ఆ ప్రేమకి సరైన భాష్యం ఇద్దరు వ్యక్తులు ఒక్కటిగా మారడం. మనకి వాలెంటైన్స్ డే గురించి తెలుసు. ప్రేమికుల ఆరాటం కూడా తెలుసు. ఆ ప్రేమ ఘాడతను వర్ణించడానికి మాటలు చాలవు. కానీ ఈ ప్రేమ ఒకటైనా మనుషులు మాత్రం సమాజం దృష్టిలో వేరుగానే ఉంటారు. ఈ ఇద్దరూ ఒకటైతే ఆవిష్కారమయ్యేదే దాంపత్య బంధం. భార్యాభర్తలను కపుల్స్ అని పిలవడం పరిపాటి. భార్యాభర్తలకు పెళ్లిరోజు తప్ప ఇంకేమీ ఉండవా? ఎందుకుండవ్? భార్యాభర్తలకోసం ప్రతి యేడు ఒక ప్రత్యేకమైన రోజుంది. అదే కపుల్స్ డే. బహుశా దీని గురించి తెలిసినవారు చాలా తక్కువ. అంతెందుకు భాగస్వామి గురించి కూడా పూర్తిగా తెలియని వారున్నారంటే ఆశ్చర్యం లేదు. ఆగస్టు 18వ తేదీని నేషనల్ కపుల్ డేగా జరుపుకుంటారు. చాలా సార్లు భాగస్వామి పుట్టినరోజు కానీ, పెళ్ళిరోజు కానీ మర్చిపోయి ఉండొచ్చు. బహుశా అది వారికి అంతో ఇంతో బాధను కలిగించి ఉండొచ్చు. ఆ బాధ మొత్తం మాయం చేయడానికి కపుల్ డే బెస్ట్ ఆప్షన్. ఈ ఒక్కసారికి ఈరోజుని మర్చిపోకుండా మీ భాగస్వామికి సర్ప్రైజ్ ఇవ్వండి, మీరే ప్రపంచంగా జీవించే మీ భాగస్వామికి మర్చిపోలేని అనుభూతిని మిగల్చండి.
ఒకప్పటి కంటే భారతదేశంలో ఒకరినొకరు ఇష్టపడి చేసుకునే పెళ్ళిళ్ళు ఎక్కువయ్యాయి. అలాగే పెద్దలు కుదిర్చిన వివాహాల్లో కూడా పెళ్ళి తర్వాత ఒకరి కోసం ఒకరు చేసుకునే అడ్జస్ట్మెంట్లు, బాధ్యతలు పంచుకోవడంతో బంధమే కాదు ఇద్దరి మధ్య ప్రేమ కూడా మరింత పటిష్టం అవుతుంది. మగవారు కూడా నేటి పరిస్థితులకి తగినట్టు మారుతూ ఉండడంతో చాలా జంటలు సంతోషంగా, సంతృప్తిగా జీవిస్తున్నారు. మగవాడిని తల్లి తరువాత తల్లిగా చూసుకునే గొప్ప వ్యక్తి భార్యే.. కపుల్ డే రోజు భాగస్వామిని ఈరోజు బయటికి తీసుకెళ్ళి సంతోషపెట్టాలని ప్రతి భర్తకు ఉంటుంది. కానీ అది కదరచ్చు, కుదరకపోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో ఇంట్లోనే వారికోసం స్పెషల్ సర్ప్రైజ్ ఏర్పాటు చేయడం మగమహారాజుల చేతుల్లో పని.
భార్యను సంతోషపెట్టడానికి ఖరీదైన గిఫ్ట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆడవారి సంతోషం ఎప్పుడూ చిన్న చిన్న విషయాలలోనే ఉంటుంది. ఎప్పుడూ ఆఫీస్ వర్క్ తో మీరు, ఇంట్లో పనితో మీ భార్య బిజీగా ఉంటే తనకోసం ఈ ఒక్కరోజు వంట చేయండి. వంట చేయడం రాకపోతే కనీసం నవ్వుతూ కబుర్లు చెబుతూ ఆమెకి వంటలో సహాయం చేయండి. ఇద్దరూ కలిసి వంటగదిలో చేసే వంట మంచి రొమాంటిక్ మీల్ గా మారిపోతుంది.
ఒక మంచి మూవీకి తీసుకువెళ్ళండి. కుదరకపోతే పిల్లలు పడుకున్నాక మీ భాగస్వామితో ఇంట్లోనే మంచి రొమాంటిక్ మూవీ చూడండి. అదీ కుదరకపోతే కనీసం తనతో కాసేపు సరదాగా కబుర్లు చెప్పండి. లేదా తన మాటల్ని శ్రద్ధగా వినండి. ఆ కొన్ని క్షణాల కబుర్లు చాలు. తన కలల ప్రపంచం మీ ముందుంటుంది. లేదా వారి ఆలోచనల లోతు తెలుస్తుంది.
ప్రేమ ఒక దివ్యౌషధంలాంటిది. ప్రేమగా మాట్లాడే ఒక్క మాట ఇరువురిలోనూ ఒక రోజంతా ఉత్సాహంగా గడిపే శక్తిని ఇస్తుంది. ఒక చిన్న హగ్ శరీరంలో ఆక్సిటోసిన్ స్థాయిలు పెంచడంతో పాటు, మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.
పెళ్ళైన వ్యక్తులపై చేసిన ఒక పరిశోధనలో వాస్కులర్ వ్యాధి వచ్చే అవకాశం 12%తక్కువగా ఉంది. అలాగే యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా చేసిన ఒక పరిశోధనలో ప్రేమించిన వ్యక్తి కళ్ళలోకి చూస్తున్నప్పుడు ఇద్దరి హార్ట్ రేట్ ఒకే విధంగా ఉన్నట్టు తేలింది.
ప్రేమించడం, ప్రేమను పంచుకోవడం వల్ల బంధం బలపడటమే కాదు, ఆరోగ్యం లాభాలు కూడా ఉన్నాయి మరి. ఇన్ని లాభాలు తెచ్చిన మీ భాగస్వామి తో ఈ కపుల్ డేని పైన చేపుకున్నట్టే కాదు, మీదైన శైలిలో, మీ కొత్త ఆలోచనలతో కూడా జరుపుకోవచ్చు. బంధాన్ని బిందాస్ గా మార్చుకోవచ్చు.
*నిశ్శబ్ద.