సైబర్ నేరాల వలలో చిక్కుకుంటున్న అమాయకులు
posted on Dec 30, 2025 6:50PM

సులభంగా డబ్బు వస్తుందన్న ఆశతో అమాయకులు చేస్తున్న చిన్న తప్పిదాలు, భవిష్యత్‌ను చీకట్లోకి నెట్టేస్తున్నాయి. చాలా మంది అమాయకులు సైబర్ నేరగాళ్ల మాయలో పడి బ్యాంక్ ఖాతాలను ఇతరులకు అప్పగించడం, తెలియని వ్యక్తుల నుంచి డబ్బు స్వీకరించడం, నకిలీ ఇన్వెస్ట్‌మెంట్ యాప్‌లను నమ్మడం వంటి చర్యల కారణంగా వందలాది బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ అవుతున్నా యని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఇటీవలి కాలంలో హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తం గా బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ అయ్యే కేసులు గణనీయంగా పెరిగాయని అధికారులు తెలిపారు. సైబర్ నేరాలకు సంబంధించిన డబ్బు లావాదేవీలు జరుగుతు న్నట్లు గుర్తించిన వెంటనే పోలీసులు ఖాతాలను ఫ్రీజ్ చేస్తున్నారని స్పష్టం చేశారు. అసలు ఎలా ఫ్రీజ్ అవుతున్నాయి? వ్యాపార రుణాలు ఇప్పిస్తామని, క్రిప్టో ట్రేడింగ్‌లో లాభాలు వస్తాయని, ఇన్‌స్టంట్ లోన్లు ఇస్తామని సైబర్ మోసగాళ్లు ప్రజలను మభ్యపెడుతున్నారని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే సైబర్ కేటుగాళ్లు కొందరి బాధితుల బ్యాంక్ ఖాతాలను తమ నియం త్రణలోకి తీసుకుని అక్రమ లావాదేవీలు జరిపి, ఆ డబ్బును క్రిప్టో కరెన్సీ (USDT) కొనుగోళ్లకు ఉపయోగిస్తున్నారని వెల్లడించారు.
ఇలాంటి అక్రమ లావాదేవీల్లో ఉపయోగించిన ఖాతాలను పోలీసులు గుర్తించి ఫ్రీజ్ చేస్తున్నట్లు చెప్పారు. అలాగే ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్, నకిలీ ఇన్వెస్ట్‌మెంట్ యాప్‌లు, అక్రమ లోన్ యాప్‌ల ద్వారా వచ్చిన డబ్బు కూడా సైబర్ నేరాలకు సంబంధించినదై ఉండే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. ‘మనీ మ్యూల్’గా మారుతున్న యువతవిద్యార్థులు, నిరుద్యోగ యువత, డ్రైవర్లు, రోజువారీ కూలీలే ప్రధానంగా సైబర్ నేరగాళ్ల లక్ష్యమవుతు న్నారని పోలీసులు తెలిపారు.