డీఎస్పీ నిర్లక్ష్యం కారణంగానే తొక్కిసలాట.. సీఎం చంద్రబాబుకు అధికారుల నివేదిక
posted on Jan 9, 2025 8:51AM
తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు మరణించారు. మరో 48 మంది గాయపడ్డారు. ఇలా ఉండగా తిరుపతి తొక్కిసలాట సంఘటనపై అధికారులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు నివేదిక ఇచ్చారు. ఆ నివేదికలో అధికారులు డీఎస్పీ నిర్లక్ష్యం కారణంగానే తొక్కిసలాట చోటు చేసుకుందని పేర్కొన్నారు. తొక్కిసలాట జరిగినా డీఎస్పీ సరిగ్గా స్పందించలేదని, ఎస్పీ వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని భక్తులకు సహాయం అందించారని నివేదికలో పేర్కొన్నారు. తొక్కిసలాట జరిగిన 20 నిమిషాల వరకు అంబులెన్స్ డ్రైవర్ కూడా అందుబాటులోకి రాలేదని పేర్కొన్నారు.
తిరుపతి తొక్కిసలాట ఘటనపై తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ఆరుగురు మరణించడం కలచివేసిందన్నారు. ఈ ఘటనలో అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారంతా కోలుకుంటున్నారనీ, వారు మాట్టాడుతున్నారనీ బీఆర్ నాయుడు తెలిపారు.
కాగా తొక్కిసలాటలో విశాఖకు చెందిన జి. రజనీ (47) లావణ్య (40), శాంతి (34), తళనాడుకు చెందిన మెట్టు సేలం మల్లికా, కర్ణాటకకు చెందిన నిర్మల (50), నర్సీపట్నంకు చెందిన బొద్దేటి నాయుడుబాబు మరణించారు. తొక్కిసలాటలో గాయపడిన వారంతా కోలుకుంటున్నారు. ఈ ఘటనలో 40 మంది అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చేరగా వారిలో 32 మందికి ప్రాథమిక చికిత్స చేసి డిశ్చార్జ్ చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారు కూడా కోలుకుంటున్నారనీ, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందనీ వైద్యులు తెలిపారు.
ఇలా ఉండగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తిరుపతికి బయలుదేరి వెళ్లారు. తిరుపతి రుయా, స్విమ్స్ హస్పటల్స్ లో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శిస్తారు. తొక్కిసలాటలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందిచాలని ఆయన ఇప్పటికే కలెక్టర్ ను ఆదేశించారు.