నేడు తిరుపతిలో చంద్రబాబు పర్యటన.. తొక్కిసలాట బాధితులకు పరామర్శ

తిరుపతిలో తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గురువారం ( జనవరి 9) తిరుపతిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన రుయా, స్విమ్స్ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న తొక్కిసలాట బాధితులను పరామర్శిస్తారు. అలాగే తొక్కిస లాట మృతుల కుటుంబాలకు, చికిత్స పొందుతున్న వారికీ ఎక్స్ గ్రేషియా ప్రకటించే అవకాశం ఉంది.  గురువారం (జనవరి 9) ఉదయం 11 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి హెలికాప్టర్ ద్వారా గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి తిరుపతి బయలుదేరుతారు. మధ్యాహ్నం 12 గంటలకు తిరుపతి విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా రుయా, స్విమ్స్ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న తొక్కిసలాట బాధితులను పరామర్శించేందుకు వెడారు. అనంతరం టీటీడీ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. తిరుపతి తొక్కిసలాటపై ఇప్పటికే అధికారులు చంద్రబాబుకు ప్రాథమిక నివేదిక అందజేసిన సంగతి తెలిసిందే. డీఎస్పీ నిర్లక్ష్యం కారణంగానే తొక్కిసలాట జరిగిందని అధికారులు ఆ నివేదికలో పేర్కొన్నారు.