జగన్ సర్కార్ కు ఇక కౌంట్ డౌన్?!

జగన్  సర్కార్ పూర్తికాలం కొనసాగే పరిస్థితి లేదా? రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు,  వైసీపీ అధినేత జగన్  తీరుతో ఆ పార్టీలోని పలువురు ప్రస్తుత ఎమ్మెలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారా? వైసీపీ అధినేత జగన్ కు గుణపాఠం చెప్పేందుకు   కాడి పడేసి, ఎవరిదారి వారు చూసుకుంటారా?   వైసీపీ సర్కార్ ను మైనార్టీలో పడేసేందుకు చాపకింద నీరులా వ్యూహాలు రచిస్తున్నారా? అంటే.. అలాంటి పరిణామాలేవో జరుగుతున్నట్లే అనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతల్లో మూడున్నరేళ్ళుగా నివురు గప్పిన నిప్పులా ఉన్న అధినేతపై అసంతృప్తి ఒక్క సారిగా బయటపడే అవకాశాలే మెండుగా ఉన్నాయని చెబుతున్నారు. ఒక పక్కన అనాలోచిత ఆర్థిక నిర్ణయాలు, కనిపించని అభివృద్ధి.. అప్పుల ఊబి ఇత్యాది కారణాలతో జనంలో ఆగ్రహావేశాలు పెల్లుబు కుతుండటం..  ఆ ఆగ్రహం నేరుగా  వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులను జనం నిలదీసేవరకూ వెళ్లడంతో  ప్రజల్లోకి వెళ్లాలంటేనే వైసీపీ నేతలు భయపడే పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొని ఉంది.

అదే సమయంలో విపక్ష నేతలకు జనం నిరాజనాలు పడుతుంటడంలో వైసీపీ ఎమ్మెల్యేలకు తమ రాజకీయ భవిష్యత్ భూతద్దంలో కనిపిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే  గతంలో సుమారు 20 మంది ఎమ్మెల్యే జగన్ పై నిరసనగళం ఎత్తారు. అలాగే  రెండోసారి మంత్రి వర్గంలో చోటు దక్కని ఆశావహులైన మరి కొందరు ఎమ్మెల్యేలు తీవ్ర నిరాశా నిస్పృహలకు గురయ్యారు. ఒక దశలో బహిరంగంగానే తమ నిరసన గళం వినిపించారు. అప్పటికి ఏదో ఆ పరిస్థితి సద్దుమణిగినా ఇక ముందు  సందర్భం, అవకాశం దొరికినా తిరుగుబాటు బావుటా ఎగురవేసేందుకు అసంతృప్తులు వ్యూహాలకు పదును పెట్టుకుంటున్నారని పరిశీలకులు భావిస్తున్నారు.

వీటికి తోడు ఏపీకి ఒకే ఒక్క అమరావతి రాజధాని అంటూ ఆ ప్రాంత రైతులు, మహిళలు చేపట్టిన మహా పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతుండటం, ప్రజాభీష్టానికి వ్యతిరేకంగాపార్టీ అధినేత ఒత్తిడితో అనివార్యంగా పాదయాత్రకు వ్యతిరేకంగా ప్రకటనలు గుప్పించాల్సిన పరిస్థితిలో ఉండటం కూడా వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు, క్యాడర్ లో అసంతృప్తిని ద్విగుణీకృతం చేస్తున్నదని పార్టీ వర్గాలే అంటున్నాయి.  ఇక ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్చడానికి జగన్ తీసుకున్న నిర్ణయం ఆయనను ఇక ఎంత మాత్రం సహించలేమనీ, ఆయన అరాచకానికి ఈ నిర్ణయం పారాకాష్ట అని పార్టీలోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందని అంటున్నారు.

జగన్ వీర విధేయుడిగా పేరొందిన కొడాలి నాని కూడా ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ నిర్ణయం తీవ్రంగా వ్యతిరేకించడమే కాకుండా.. జగన్ ఆదేశాలను ధిక్కరించి మరీ మౌనం వహించడాన్ని ఈ సందర్బంగా పరిశీలకులు ప్రస్తావిస్తున్నారు.  ఇలా ఒకరి తరువాత ఒకరుగా పార్టీలో సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు, కొందరు మంత్రులూ కూడా అధినేత తీరు పట్ల అసంతృప్తితో రగిలి పోతున్నారంటున్నారు. అంతే కాకుండా జగన్ కేబినెట్ లో సీనియర్ మంత్రులకు సరైన గుర్తింపు లేకపోవడం.. వారి ఆదేశాలను అధికారులు ఇసుమంతైనా లెక్క చేయని పరిస్థితి ఉండటంతో వారంతా రగిలిపోతున్న పరిస్థితి ఉందంటున్నారు. ఇలాంటి కారణలతోనే వైసీపీలో  తిరుగుబావుటా ఎగిరే రోజు ఎంతో దూరంలో లేదని పరిశీలకుల విశ్లేషిస్తున్నారు.  

ఇక వైఎస్ జగన్ కు ప్రశాంత్ కిశోర్ బృందం ఇచ్చిన నివేదిక, తాను స్వయంగా నియమించుకున్న మరో టీం ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యేల్లో 100 మంది పనితీరు బాగోలేదు. వారిలో 80 మంది వచ్చే ఎన్నికల్లో గెలిచే ఛాన్సే లేదంటున్నారు. అలా ఏమాత్రం గెలిచే అవకాశం ఉండదనే వారికి రానున్న ఎన్నికల్లో టికెట్లు ఇచ్చేది లేదని జగన్ స్పష్టంగా చెప్పడం కూడా వారిలో అసంతృప్తికి, ఆవేదనకు కారణం అయింది. అందుకే వైసీపీలో ఉంటే టికెట్ ఎలాగూ రాదు కనుక అటు టీడీపీలోనూ, ఇటు జనసేన పార్టీలోనో లేదా బీజేపీలోనో చేరేందుకు చాపకింద నీరులా ప్రయత్నాలు చేసుకుంటున్నారంటున్నారు.

అలా ఆ 80 మంది ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగరేయడం ఖాయమని మాజీ మంత్రి, తెలుగుదేశం సీనియర్ నాయకుడు దేవినేని ఉమ  అంటున్నారు. తిరుగుబాటు చేసేందుకు సమాయత్తం అవుతున్న ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయలేని పరిస్థితిలో జగన్ పడ్డారని ఆయన అంటున్నారు.
 ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో 50 శాతానికి పైగా ఓటు బ్యాంకుతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు పూర్తికాలం కొనసాగలేదు. గతంలో ఎన్టీఆర్ సర్కార్, పీవీ ప్రభుత్వం 50 శాతానికి పైగా ఓటు బ్యాంకును సంపాదించుకున్నాయి. అయితే.. అవి పూర్తిగా ఐదేళ్లూ అధికారంలో కొనసాగలేదు. అలాగే 50 శాతానికి పైగా ఓట్లు తెచ్చుకున్న వైఎస్ జగన్ ప్రభుత్వం కూడా పూర్తి కాలం అధికారం చెలాయించే పరిస్థితులు లేవంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పలు సందర్భాలలో అన్నారు. ఈ విశ్లేషణలు, అభిప్రాయాల నేపథ్యంలోనే   వైసీపీ సర్కార్ కు కౌంట్ డౌన్ ప్రారంభమైనట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu