గల్లాకు టిక్కెట్ ఇస్తే డిపాజిట్ గల్లంతే

తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీలో రగడ మొదలయింది. ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన చిరంజీవి రాజ్యసభకు వెళ్ళడం ఖాయమని తేలడంతో పార్టీ టిక్కెట్ కోసం అనేకమంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ టిక్కెట్ తన భార్య సురేఖకు ఇవ్వాలని చిరంజీవి కోరుతున్నారు. సురేఖ అభ్యర్థిత్వానికి ఈ ప్రాంత కాంగ్రెస్ నాయకులెవరూ పెద్దగా అభ్యంతరం చెప్పడం లేదు. అయితే తిరుపతి టిక్కెట్ తనకు కేటాయిస్తే పోటీకి సిద్ధమని మంత్రి గల్లా అరునకుమారి తనయుడు గల్లా జయదేవ్ ప్రకటించడంతో కాంగ్రెస్ శ్రేణులు తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నాయి. ఒకవైపు అరుణకుమారి మంత్రి పదవిని అనుభవిస్తూ అది చాలదన్నట్లు ఆమె కుమారుడిని కూడా పార్టీపై రుద్ది ఎందుకు ఇతరుల అవకాశాలను దెబ్బతీయాలని చూస్తున్నారని ఆ పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ప్రాథమిక సభ్యత్వం కూడా లేని గల్లా జయదేవ్ ఆ పార్టీ తరపున పోటీచేయడానికి ఎందుకు ఉబలాటపడుతున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. ఆర్ధికపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకుని గల్లా జయదేవ్ కు టిక్కెట్ ఇస్తే అతనికి ఈ నియోజకవర్గంలో డిపాజిట్ కూడా దక్కకుండా చేస్తామని కొందరు కాంగ్రెస్ నాయకులు బాహాటంగానే హెచ్చరిస్తున్నారు. అయినా ఇవేమీ పట్టనట్లు గల్లా అరుణకుమారి తన తనయుడి టిక్కెట్ కోసం ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు.