విశాఖ 'కమీషనర్' రూటే సపరేట్
posted on Mar 14, 2012 2:24PM
ఐఎఎస్ అధికారి రామాంజనేయులు ఎక్కడ ఉన్నా తన మార్కు పాలనకోసం తంటాలుపడుతుంటారు. నిజామాబాద్ జిల్లాలో ఆయన కలెక్టర్ గా పనిచేసినప్పుడు కొందరు మొక్కజొన్న వ్యాపారులు అక్కడి రైతులకు సుమారు రూ. 30 కోట్ల మేర బకాయిలు పడ్డారు. ఈ వ్యవహారంలో రామాంజనేయులు అనవసరంగా జోక్యం చేసుకుని వ్యాపారులు, రైతులకు మధ్య ఒప్పందం కుదిర్చారు కలెక్టర్ సమక్షంలో ఒప్పందం జరిగినప్పటికీ వ్యాపారులు డబ్బులు చెల్లించకపోవడంతో మొక్కజొన్న రైతులు కలెక్టర్ కార్యాలయంపై మూకుమ్మడిగా దాడులు జరిపారు. అనంతరం జరిగిన కాల్పుల్లో ఇద్దరు రైతులు కూడా మరణించారు. అక్కడ సెటిల్ మెంట్ బెడిసికొట్టడంతో ఆయనను బదిలీచేశారు. గత ఏడాది జూన్ 18 వ తేదీన ఆయనను ప్రభుత్వం విశాఖ నగరపాలక సంస్థ కమీషనర్ గా నియమించింది. ఎప్పటిలాగానే ఆయన పదవి చేపట్టగానే ఆరంభశూరత్వం ప్రదర్శించారు. ప్రచారార్భాటం కోసం శ్రమించారు. తరువాత తనకు ఉపయోగపడతాయనుకున్న ఆర్థిక అంశాలపై దృష్టి కేంద్రీకరించారు. తనకన్నా జూనియర్ అయిన జిల్లా కలెక్టర్ ను నగరపాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్ గా ప్రభుత్వం నియమించడంతో కినుకు వహించారు. జూనియర్ కింద పనిచేయనంటూ సెలవుపై వెళ్ళి గత్యంతరం లేక మళ్ళీ విధుల్లో చేరారు. ఇటీవల ఆయన హిందూజ, రాంకి సంస్థలకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుని అపవాదులు మూటగట్టుకున్నారు. అనంతరం మురికివాడలను తరలించడానికి ప్రయత్నించి ప్రజాగ్రహానికి గురయ్యారు. ఇంత జరుగుతున్నా ఆయన వైఖరిలో పెద్దగా మార్పురావడం లేదు.