సింగరేణి కార్మికుల ఊపిరితీస్తున్న 'బ్లాక్ డంప్'

సింగరేణి బొగ్గుగనుల్లో విషవాయువుల కారణంగా గత పదేళ్ళుగా సుమారు 50 మంది చనిపోయారు. ప్రతి సంవత్సరం విషవాయువుల కారణంగా కార్మికుల ఊపిరి ఆగిపోతున్నప్పటికీ యాజమాన్యం మాత్రం ఈ వాయువులు ముందుగానే పసిగట్టి కార్మికులను హెచ్చరించడంలో విఫలమవుతోంది. సింగరేణి గనుల్లో కార్బన్ మోనాక్సైడ్ అత్యంత ప్రమాదకరమైనది. ఇది క్షణాల్లో కార్మికుల ప్రాణం తీస్తుంది. దీనితోపాటు ఆక్సిజన్, నైట్రోజన్ కలిసి బ్లాక్ డంప్ అనే విషవాయువు వెలువడుతుంది. ఇది కూడా ప్రాణంతమైనదే. గనుల్లో వెలువడే వాయువులను కొలవడానికి ప్రత్యేక పరికరాలుంటాయి. వాయువులు ఏఏ నిష్పత్తిలో ఎంతెంత శాతం ఉన్నాయో ఈ పరిక్షల ద్వారా తెలుస్తుంది. ముందుగా చెక్ చేసి గ్యాస్ శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపిన తరువాత కార్మికులను గనుల్లోకి పంపాల్సి ఉంటుంది. అయితే ఈ పరీక్షలు క్రమం తప్పకుండ నిర్వహించకపోవడం, వాయువులను సరిగా అంచనావేయకపోవడం వల్ల కార్మికులు తరచుగా ఈ విషవాయువుల పాలిట పడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే కొద్దిరోజుల క్రితం ఆర్ కె 1 గనిలో విషవాయువులు వెలువడి ఇద్దరు కార్మికులు మృతిచెందారు.