సోనియా పదవీ కాలం పొడుగింపు ఎందుకో?

 

కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం నిన్న డిల్లీలో జరిగింది. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పదవీ కాలాన్ని మరో ఏడాది పెంచుతూ అందులో నిర్ణయం తీసుకొన్నారు. కానీ రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు చేప్పట్టాలని చాలా ఉత్సాహపడుతుంటే సోనియా గాంధీ పదవీ కాలం మరో ఏడాదిపాటు పొడిగించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. బహుశః బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే రాహుల్ గాంధీకి అధ్యక్ష బాధ్యతలు అప్పజెప్పలేదేమోననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల మొదలు ఇంతవరకు జరిగిన అన్ని ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాజయం పొందుతూనే ఉంది. వచ్చే నెల జరుగనున్న బీహార్ ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేకనే కాంగ్రెస్ పార్టీ జనతా పరివార్ చెయ్యి పట్టుకొంది. లాలూ, నితీష్ కుమార్ చెరొక 100 సీట్లు పంచుకొని, మిగిలిన 40 సీట్లను కాంగ్రెస్ పార్టీకి కేటాయించారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలలో బీజేపీని, కొత్తగా ఏర్పడిన వామపక్ష కూటమిని, సమాజ్ వాదీ పార్టీని డ్డీకొని ఆ 40 సీట్లయినా గెలుస్తుందో లేదో అనుమానమే. ఒకవేళ బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో కూడా మళ్ళీ పరాభవం ఎదురయితే ఆ అప్రదిష్ట రాహుల్ గాంధీపై పడకూడదనే ఉద్దేశ్యంతోనే బహుశః ఆయనని అధ్యక్ష బాధ్యతలు అప్పగించలేదేమో? కానీ బీహార్ తరువాత పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల ఎన్నికలు వస్తాయి. మరి అప్పుడు కూడా రాహుల్ గాంధీని ఇలాగే కాంగ్రెస్ పార్టీ దాచి పెట్టుకొంటుందా? చూడాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu