తెలంగాణ కాంగ్రెస్ లో రేవంత్ సీన్ అయిపోయిందా?
posted on May 29, 2023 2:26PM
జూనియర్, సీనియర్ పోరులో రేవంత్ వెనుకబడ్డారా? తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే వైఎస్ బిడ్డ షర్మిలకు నాయకత్వం అప్పగించడమే మేలన్న నిర్ణయానికి కాంగ్రెస్ హై కమాండ్ వచ్చేసిందా? అంటే షర్మిల కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో వరుస భేటీలను చూస్తుంటే ఔననే అనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఆ రాష్ట్ర రాజకీయాలలో షర్మిల ఇంపార్టెన్స్ ఒక్క సారిగా పెరిగిపోయింది. కేసీఆర్ ఫ్యామిలీపై నిర్భీతిగా, నిర్మొహమాటంగా విమర్శలు గుప్పిస్తున్న షర్మిల ప్రాధాన్యతను ఇతర పార్టీలన్నీ గుర్తించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే గత కొంత కాలంగా షర్మిల ఎవరు వదిలిన బాణం అంటూ పరిశీలకులే కాదు, రాజకీయ వర్గాలలోనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి.
తొలుత ఆమె రాజకీయ ప్రవేశమే జగనన్న వదిలిన బాణాన్ని నేను అంటూ ఆరంభమైంది. ఆ తరువాత రాష్ట్ర విభజన అనంతరం జగనన్నతోనే విభేదించి.. ఏపీ వదిలి తెలంగాణలో తన తండ్రి వైఎస్సార్ పేరిట వైఎస్సార్ తెలంగాణ పార్టీని ఏర్పాటు చేసి, సుదీర్ఘంగా పాదయాత్ర చేయడమే కాకుండా, వరుస దీక్షలతో రాష్ట్ర రాజకీయాలలో గుర్తించక తప్పని శక్తిగా అవతరించారు షర్మిల.
షర్మిల సొంత పార్టీ పెట్టుకుని, ఏపీలో, సొంత అన్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, ఆ రాష్ట్రాన్ని వదిలి తెలంగాణ రాజకీయాల్లో ఎందుకు వేలు పెటినట్లు? అసలు షర్మిల ఎవరు వదిలిన బాణం? అన్న ప్రశ్న ఆమె రాజకీయ పార్టీ పెట్టిన సమయంలోనే ప్రముఖంగా వినిపించింది. అయితే ఆమె ఇప్పుడు ఇంత దూరం నడిచేసిన తరువాత ఆ ప్రశ్న ముగిసిన అధ్యాయం అన్న వాదన ఇప్పుడు గట్టిగా వినిపిస్తోంది. అయితే ఇటీవలి కాలం వరకూ ఆమె రాజకీయ లక్ష్యం ఏమిటి? రాజకీయంగా ఆమె ఎవరిని టార్గెట్ చేస్తున్నారు అన్న ప్రశ్నలు బలంగా తెరమీదకు వచ్చాయి. జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలను మించి వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, అయన కుమారుడు కేటీఆర్, కుమార్తె కవిత, మేనల్లుడు హరీష్ రావు, మరో ఇంటి చుట్టం సంతోష కుమార్ ఇలా బీఆర్ఎస్ లో (ఒకప్పడు టీఆర్ఎస్) ఉన్న కేసీఆర్ కుటుంబం మొత్తాన్నిటార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు. మంత్రి కేటీఆర్ రేపెప్పుడో, ప్రధాని మోడీ బట్టలు ఊదదీసి నడిబజార్లో నిలబెడతామని అంటున్నారు. కానీ షర్మిల తన విమర్శల ద్వారా తెరాస ప్రభుత్వాన్ని నిత్యం ఉతికి ఆరేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే షర్మిల స్వల్ప వ్యవధిలో కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో రెండు సార్లు భేటీ కావడంతో ఆమె కాంగ్రెస్ గూటికి చేరుతున్నారా? అంటే వైఎస్సార్ టీపీని తన తండ్రి జీవించి ఉన్నంత కాలం ఏ పార్టీలో అయితే ఉన్నారో ఆ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే దిశగా అడుగులు వేస్తున్నారా అన్న కోణంలో పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నారు.
తాజా బేటీలో డీకే శివకుమార్ షర్మిలతో ఆమె తండ్రి వైఎస్సార్ తో తనకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ వరుస భేటీలతో తెలంగాణ కాంగ్రెస్ లో వైఎస్సార్టీపీ విలీనంపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఒక వేళ అలా విలీనం అంటూ జరిగితే తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు షర్మిలకు అప్పగించే అవకాశాలే మెండుగా ఉన్నాయని అంటున్నారు.
వైఎస్సార్ బిడ్డగా షర్మిలకు పగ్గాలు అప్పగిస్తే.. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు అభ్యంతరం చెప్పే అవకాశం దాదాపుగా ఉండదని పరిశీలకులు అంటున్నారు. కాగా కాంగ్రెస్ లో వైఎస్సార్టీపీ విలీనం అంశాన్ని కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక గాంధీ స్వయంగా పరిశీలిస్తున్నరని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి. ఇక షర్మిల కాంగ్రెస్ గూటికి చేరడం, ఆమెకు టీపీసీసీ పగ్గాలు అప్పగించడం అన్న ప్రచారం ఓ వైపు జోరుగా సాగుతుంటే.. మరో వైపు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పరిస్థితి ఏమిటన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ శ్రేణులు మాత్రం షర్మిలకు టీపీసీసీ పగ్గాలు అప్పగించడం అంటూ జరిగితే పార్టీలో రేవంత్ సీన్ అయిపోయినట్లేననీ, ఆయన దారి తెలుగుదేశంపైపు మళ్లొచ్చని అంటున్నాయి.