ఎంఐఎం వ్యూహమేంటి? లాభం ఎవరికి?

ఎంఐఎం అనగానే తెలంగాణలో పాతబస్తీకే పరిమితమైన జాతీయ పార్టీగా గుర్తింపు ఉంది. అయితే ఆ పార్టీ హైదరాబాద్ మహానగరంలో పాతబస్తీకే పరిమితం కావడం వెనుక  ఆ పార్టీ అక్కడే బలంగా ఉండటం కారణమని అంతా భావిస్తు వస్తున్నారు. అయితే ఎంఐం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాత్రం వచ్చే ఎన్నికలలో తమ పోటీ పాతబస్తీ వెలుపల కూడా ఉంటుందని చెబుతున్నారు.

 తెలంగాణలో బీజేపీ విస్తరణను అడ్డుకోవడమే లక్ష్యంగా తామీ నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నారు. ఇంత కాలం అనధికార మిత్ర పక్షమైన బీఆర్ఎస్ కోసం తాము ఓల్డ్ సిటీకే పరిమితమయ్యామనీ, అయితే అందువల్ల బీజేపీ బలపడుతోందనీ, అందుకే అవసరమైతే బీఆర్ఎస్ ను పక్కన పెట్టి మరీ ఓల్డ్ సిటీ బయట పోటీ చేయడానికి రెడీ అవుతున్నామని అసదుద్దీన్ చెబుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికలలో తాము నిజామాబాద్, కరీంనగర్, సికిందరాబాద్ ల నుంచి పోటీలో లేకపోవడం వల్ల బీజేపీ గెలిచిందని ఆయన గుర్తు చేశారు. ఎంఐఎం తమ ఓట్లు చీల్చడం ద్వారా బీజేపీ విజయానికి దోహదపడుతోందని ఆరోపణలు చేస్తున్న సెక్యులర్ పార్టీలు ఈ విషయాన్ని ఎందుకు గుర్తించడం లేదని నిలదీశారు.

 తెలంగాణ కొత్త సచివాలయంపై బీజేపీ జెండా ఎగరడానికి తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని ఒవైసీ స్పష్టం చేశారు.  ఎంఐఎం బలంగా ఉంటేనే తెలంగాణలో మతసామరస్యం వెల్లివిరుస్తుందని చరిత్ర చెబుతున్న సత్యమని ఒవైసీ అంటున్నారు.  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అసెంబ్లీ స్థానాల సంఖ్యపై త్వరలో తుది నిర్ణయం తీసుకుంటామన్నారు.  2014,  2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించడంలో  ఏఐఎంఐఎం కీలక పాత్ర పోషించిందని ఆయన గుర్తు చేశారు. అయితే పరిశీలకులు మాత్రం ఓల్డ్ సిటీ బయట ఎంఐఎం పోటీ చేయడం వల్ల అంతిమంగా బీజేపీయే లబ్ధి పొందుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఇంత కాలం ఓల్డ్ సిటీకి పరిమితమై పోటీలో ఉన్న ఎంఐఎం కే బీజేపీ యేతర పార్టీలు, ఇప్పుడైతే బీఆర్ఎస్.. అంతకు ముందు కాంగ్రెస్ ఫ్రెండ్లీ పోటీ ద్వారా బయటి ఓట్లు చీలి బీజేపీ లబ్ధి పొందకుండా పరస్పర సహకారం అందించుకునేవనీ, ఇప్పుడు ఎంఐఎం ఓల్డ్ సిటీ దాటి బయటకు వస్తే.. సెక్యులర్ ఓట్లు చీలి  బీజేపీకే ఎక్కువ ప్రయోజం చేకూరుతుందని విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద జాతీయ స్థాయిలో  కాంగ్రెస్ బలోపేతమౌతోందన్న భావన వ్యక్తమౌతున్న వేళ ఎంఐఎం నిర్ణయం బీజేపీకి నెత్తిన పాలు పోసినట్లేనని అంటున్నారు.