బూమ్‌బూమ్ వాసుదేవరెడ్డి మీద సీఐడీ సిట్‌కి ఫిర్యాదు!

ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ వాసుదేవరెడ్డి మీద సిఐడి సిట్‌కు గుడివాడవాసి, సీనియర్ జర్నలిస్ట్ దుగ్గిరాల ప్రభాకర్ ఫిర్యాదు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో గుడివాడలో చేసిన అవినీతిపై వాసుదేవ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని, అప్పటి ఉమ్మడి కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ మాధవిలతారెడ్డిలపై దుగ్గిరాల ప్రభాకర్ సిఐడి సిట్‌కు ఫిర్యాదు చేశారు. గుడివాడ ఆటోనగర్‌లోని తన కార్యాలయంలో దుగ్గిరాల ప్రభాకర్  ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి, తన ఫిర్యాదుకు సంబంధించిన వివరాలు తెలియజేశారు. వైసీపీ ప్రభుత్వ హయంలో గుడివాడలో జరిగిన లక్షల రూపాయల కుంభకోణంపై దుగ్గిరాల ప్రభాకర్ పూర్తి ఆధారాలను మీడియాకు చూపించారు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన వివరాల బుల్లెట్ పాయింట్స్...

* వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్  మాజీ మేనేజింగ్ డైరెక్టర్ వాసుదేవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని, అప్పటి జాయింట్ కలెక్టర్ మాధవిలతారెడ్డి భారీగా అవినీతికి పాల్పడ్డారు. వారంతా  చేసిన అవినీతిని పూర్తి ఆధారాలతో సిఐడి సిట్‌కు ఫిర్యాదు చేశాను.

* ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పబ్లిక్ టెండర్ ద్వారా కేవలం స్క్వేర్ ఫీట్‌కు నాలుగు రూపాయలకు నా తల్లి సీతామహాలక్ష్మి ఏపీ బేవరేజెస్ గుడివాడ గోడౌన్ దక్కించుకున్నారు. 

* ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే 20వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆటోనగర్‌లో గోడౌన్ నిర్వహిస్తున్నాం.

* 2019 వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత... పద్మా రెడ్డి అనే వ్యక్తికి లబ్ధి చేకూర్చేందుకు రెండేళ్లు కాల పరిమితి ఉన్నప్పటికీ కారణం లేకుండా  గోడౌన్ మార్చేందుకు వాసుదేవరెడ్డి ప్రయత్నించాడు. ఇదేమిటని అప్పటి కార్పొరేషన్ ఎండి వాసుదేవ రెడ్డిని అడిగితే మాపై దుర్భాషలాడారు. 

* అప్పట్లో మా కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని, వైసీపీ నేత దుక్కిపాటిశశి భూషణ్ ఫోన్లు చేసి బెదిరించారు.

* కారణం లేకుండా ఎందుకు గోడౌన్ మారుస్తున్నారని నా తల్లి సీతామహాలక్ష్మి 2020 మే నెలలో అడిగితే వాసుదేవ రెడ్డి బూతులు తిట్టారు.

* ఆయన బూతులతో మనస్తాపం చెందిన నా తల్లి సీతామహాలక్ష్మి జూన్ నెలలో మరణించారు.

* తర్వాత కార్పొరేషన్ పబ్లిక్ టెండర్ పిలువగా టెండర్‌లో పాల్గొనవద్దని మమ్మల్ని బెదిరించారు. 

* మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసేలా గోడౌన్‌లోని  లిక్కర్ కేసులు పగలగొట్టి తగులపెట్టారు. 

* ఈ దారుణాని వీడియో ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కనీసం మా కంప్లైంట్ కూడా తీసుకోలేదు.

* మా మీదే కేసులు పెడతావా అంటూ మళ్ళీ కొడాలి నాని, దుక్కిపాటి శశిభూషణ్ బూతులు తిడుతూ మా కుటుంబాన్ని బెదిరించారు. దాంతో మేము టెండర్ వేయకుండా సైలెంట్‌గా ఉండిపోయాం. పూర్తి ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా టెండర్ ప్రక్రియ జరిగింది.

* రూరల్ ప్రాంతాల్లో చదరపు అడుగు ఐదు రూపాయలు మాత్రమే ఉండాలని నిబంధనలో ఉండగా, లీస్ట్ టెండర్ దారులను పరిగణలోకి తీసుకోకుండా పద్మా రెడ్డికి 9.99 పైసలకు టెండర్ కట్టబెట్టారు. పబ్లిక్ టెండర్లు ఐదు రూపాయలకు మరో ముగ్గురు టెండర్ వేసిన.... వాటిని పరిగణలోకి తీసుకోలేదు. లక్షలాది రూపాయల కార్పొరేషన్ సొమ్ము వైసీపీ నేతలు తమ జేబుల్లోకి వేసుకున్నారు.

*  అంతేకాకుండా గోడౌన్ క్యానోపి (వరండా)కు ఎటువంటి నగదు చెల్లించాల్సిన అవసరం లేకపోయినా పద్మా రెడ్డి కి లబ్ధి చేకూర్చేలా ప్రతినెల లక్షా 12 వేలు అదనంగా చెల్లిస్తున్నారు.

* ఈ మొత్తం వ్యవహారంలో పద్మా రెడ్డి అల్లుడైన ఐఆర్ఎస్ అధికారి కర్రీ రామ్ గోపాల్ రెడ్డి కూడా భాగస్వామ్యం అయ్యి, కార్పొరేషన్ సొమ్మును వాటాలుగా పంచాడు.

* కార్పొరేషన్‌లో జరిగిన అవినీతిపై మాజీ ఎండి వాసుదేవరెడ్డి, అప్పటి జేసి మాధవి లతారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని, పద్మా రెడ్డి, వైసీపీ నేత దుక్కిపాటి శశిభూషణ్ చేసిన లక్షలాది రూపాయల కుంభకోణంపై పూర్తి ఆధారాలతో సిఐడి సిట్‌కు అందచేశాను.