అమిత్ షాకు కేసీఆర్ ఆఫర్! ఏంటది? ఏం జరగబోతోంది? 

బీజేపీతో దోస్తీకి కేసీఆర్ ప్రయత్నించారా? గులాబీ బాస్ కు కమలం పెద్దలు హ్యాండిచ్చారా?.. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేసిన కొన్ని కామెంట్లు ఇప్పుడు  హాట్ టాపిక్ గా మారాయి. హైదరాబాద్ జిల్లా బీజేపీ సమావేశంలో బండి సంజయ్ కొన్ని హాట్ కామెంట్స్  చేశారు. అమిత్ షా, కేసీఆర్ డీల్స్ కు సంబంధించి కీలక విషయాలు చెప్పారు సంజయ్. ఇవే ఇప్పుడు రాష్ట్రంలో సంచలనం రేపుతున్నాయి. 

తెలంగాణలో ప్రస్తుతం రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. ఇప్పటికే బీజేపీ దూకుడు మీదుండగా.. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఎంపికతో కాంగ్రెస్ కూడా రేసులోకి వచ్చింది. నిజానికి గత ఏడేండ్లుగా తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ఎదురులేకుండా పోయింది. 2014లో బోటాపోటీ మెజార్టీలోనే పవర్ లోకి వచ్చిన కేసీఆర్.. తర్వాత కాలంతో తనదైన ఎత్తులతో పార్టీని మరింత బలోపేతం చేసుకున్నారు. అదే సమయంలో విపక్షాలను బలహీనం చేసేలా పావులు కదిపారు. కేసీఆర్ ఎత్తులతో కాంగ్రెస్ పార్టీ దిగజారిపోయింది. బీజేపీ పరిస్థితి అంతంత మాత్రంగానే తయారైంది. 

అయితే బీజేపీ చీఫ్ గా బండి సంజయ్ నియామకంతో బీజేపీ స్పీడ్ పెరిగింది. దుబ్బాక ఉప ఎన్నికతో తెలంగాణ పొలిటికల్ సీన్ మారిపోయింది. సొంత జిల్లాలో బీజేపీ సంచలన విజయం సాధించడంతో కేసీఆర్ కు మైండ్ బ్లాక్ అయింది. వెంటనే జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లోను కారు పార్టీకి చెమటలు పట్టించింది కమలం పార్టీ. ఏకంగా 48 డివిజన్లు గెలుచుకుని వణుకు పట్టించింది. గ్రేటర్ ఫలితాలతో ఉలిక్కిపడిన  కేసీఆర్.. మేయర్ ఎన్నికను వెంటనే జరపకుండా వాయిదా వేశారు. జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికలను వాయిదా వేసినప్పుడే రకరకాల చర్చలు తెరపైకి వచ్చాయి. మేయర్ సీటును బీజేపీకి ఇచ్చేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారని ప్రచారం జరిగింది. ఎంఐఎంతో మిత్రపక్షంగా వ్యవహరించే టీఆర్ఎస్.. బీజేపీకి మేయర్ సీటు ఎలా ఇస్తుందన్న వాదన కూడా జరిగింది. అయితే రెండు నెలల తర్వాత నిర్వహించిన మేయర్ ఎన్నికలో మాత్రం అధికార పార్టీనే పోటీ చేసి గెలిచింది. 

జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికకు సంబంధించి సంచలన విషయం ఇప్పుడు వెలుగులోనికి వచ్చింది. గ్రేటర్ మేయర్ పీఠాన్ని బీజేపీకి కేసీఆర్ ఆఫర్ చేశారట. ఈ విషయాన్ని చెప్పిందో ఎవరో కాదు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయే. జీహెచ్ఎంసీ మేయర్ సీటును తీసుకోవాలని కేసీఆర్ తమకు ఆఫర్ చేశారని... ఈ విషయాన్ని అమిత్ షాతో కూడా చర్చించామని తెలిపారు. అయితే కేసీఆర్ ఆఫర్ ను అమిత్ షా తిరస్కరించారని చెప్పారు. అప్పటి నుంచే కేసీఆర్ కు భయం పట్టుకుందని బండి సంజయ్ అన్నారు. తన ఆఫర్ ను అమిత్ షా కాదనడంతో.. తనపై కేంద్రం పెద్దలు ఫోకస్ చేశారనే టెన్షన్ కేసీఆర్ కు పట్టుకుందని సంజయ్ అన్నారు.

అమిత్ షాకు కేసీఆర్ ఆఫర్ ఇచ్చారంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఇప్పటికే బీజేపీ, టీఆర్ఎస్ ఒక్కటేనని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోంది. పైపైకి తిట్టుకుంటూ లోపల సహకరించుకుంటారని రేవంత్ రెడ్డి కూడా పలుసార్లు విమర్శలు చేశారు. కేసీఆర్ జైలుకు పోవడం ఖాయమని చెబుతున్న బండి సంజయ్.. అవినీతి విషయాలు ఎందుకు బయటపెట్టడం లేదని కూడా ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో తమకు కేసీఆర్ ఆఫర్ ఇచ్చారని బండి సంజయే చెప్పడంతో.. కాంగ్రెస్ ఆరోపణలు నిజమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సంజయ్ వ్యాఖ్యలే అస్త్రంగా కాంగ్రెస్ నేతలు రెండు పార్టీలను టార్గెట్ చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి.